GAZA: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు
పదుల సంఖ్యలో పౌరులు మృతి.... హమాస్ టెర్రర్ కేంద్రాలనే దాడి చేశామన్న ఇజ్రాయెల్;
భూతల దాడులకు దిగేందుకు ఉత్తర గాజాను వీడాలని పాలస్తీనా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దాడికి దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలో పౌరులకు సహాయక సామగ్రి అందేలా ఇజ్రాయెల్‌తో అమెరికా సంప్రదింపులు జరుపుతోంది. ఈజిప్టు సరిహద్దుల్లో వందలాది ట్రక్కుల్లో సహాయ సామగ్రి గాజాలోకి ప్రవేశించేందుకు వేచి చూస్తోంది. ఇప్పటికే 10 లక్షల మందికిపైగా ఉత్తరగాజాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్నారు. దక్షిణగాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
రఫా నగరంలో 27 మంది, ఖాన్ యూనిస్ నగరంలో 30 మంది మరణించినట్లు హమాస్ అధికారులు తెలిపారు. గాజా పౌరులకు సహాయక సామగ్రి అందించడానికి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే గాజాలో ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. ఐతే తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఇప్పటివరకు 2 వేల 800 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు హమాస్ రాకెట్లను ప్రయోగిస్తుండటంతో ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులను ఆపడం లేదు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఎటు చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఈ శిథిలాల్లో 1200 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాజాలో ఆహారం, నీరు, ఇంధన కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజా నగరంలో సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశారు. ఇందులో కొందరు వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాజాపై భూతల దాడికి దిగేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. దీనిపై రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఇంధన కొరత కారణంగా ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వేలాది మంది ప్రాణాలు కోల్పోతారని సహాయక బృందాలు పేర్కొన్నాయి. మరోవైపు రఫా సరిహద్దు మీదుగా గాజాలోకి ప్రవేశించేందుకు సహాయ సామగ్రితో ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 300 టన్నుల ఆహారం ఉంది. వందలాది మంది గాజా నుంచి ఈజిప్టులోకి ప్రవేశించేందుకు అక్కడ వేచి ఉన్నారు.