Kamala Harris: ఓటమిని అంగీకరిస్తున్నా.. క‌మ‌లా హ్యారిస్

107 రోజుల ఎన్నిక‌ల పోరాటాన్ని తాను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాన‌న్న క‌మ‌ల‌;

Update: 2024-11-07 03:00 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల  ఫలితాలను అంగీకరిస్తున్నానని.. పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని కమలా హారిస్‌ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫలితాలపై ఆమె తొలిసారి స్పందించారు. వాషింగ్టన్‌ డీసీలోని హోవర్డ్‌ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందన్నారు. అయితే.. దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని చెప్పారు.

‘‘ఇది ఆశించిన ఫలితం కాదు. దీని కోసం మనం పోరాడలేదు. కానీ.. దీన్ని అంగీకరించాల్సిందే. ఎన్నికల్లో పోటీపడిన తీరుపై గర్వంగా ఉంది. దేశం పట్ల ప్రేమ, సంకల్పంతోపాటు మీరు నాపై ఉంచిన నమ్మకంతో నా హృదయం నిండిపోయింది. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, సమాన న్యాయం కోసం పోరుబాటను ఎప్పటికీ వీడను. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుంది. దానర్థం గెలవలేమని కాదు’’ అని వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి కమల ప్రసంగించారు.

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినట్లు కమలా హారిస్‌ వెల్లడించారు. అధికార మార్పిడి శాంతియుతంగా సాగేలా ఆయనకు, ఆయన బృందానికి సాయం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. అమెరికాలో అధ్యక్షుడికి లేదా పార్టీకి కాకుండా రాజ్యాంగానికి, మనస్సాక్షికి, దేవుడికి విధేయత చూపుతారని గుర్తుచేశారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదేనని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

బైడెన్‌ తప్పులు కమల  మెడకు

ప్రజాస్వామ్యం, శాంతి అంటూ ప్రవచిస్తూ యుద్ధాలను ప్రోత్సహించడం జో బైడెన్‌ సారథ్యంలోని డెమోక్రటిక్‌ పార్టీని భారీగా దెబ్బతీసింది. వయసు పైబడుతున్నా... ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా... మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న జో బైడెన్‌ నిర్ణయంతో డెమోక్రాట్లపై ప్రజలకు విసుగెత్తింది. చివరకు ఆయన స్థానంలో కమలా హారిస్‌ను హడావుడిగా అభ్యర్థిగా ప్రకటించినా... బైడెన్‌ ప్రభావం ఆమె మెడకు చుట్టుకుంది. ఉపాధ్యక్షురాలిగా పనిచేసినందున... బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిలో కమల పాత్ర కూడా ఉన్నట్లు ప్రజలు భావించారు. ఫలితంగా తాను కొత్తగా చేస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని హామీ ఇచ్చినా ప్రజలు అంతగా నమ్మలేదు. తొలి మహిళా అధ్యక్షురాలు అనే సెంటిమెంట్‌ కంటే... ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతున్న తీరే వారిని ప్రభావితం చేసింది.

Tags:    

Similar News