CHINA FLOODS: చైనాలో వరద బీభత్సం... 21 మంది మృతి

క్విన్లింగ్‌ పర్వత ప్రాంతంలో వైజెపింగ్‌ గ్రామంపై విరుచుకుపడ్డ వరద.. కొట్టుకుపోయిన ఇళ్లు, మనుషులు;

Update: 2023-08-15 03:30 GMT

చైనాలో ఒక్కసారిగా వరద విరుచుకుపడడంతో( deadly flash flood) 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. క్విన్లింగ్‌ పర్వత ప్రాంతంలోని షీ అనే నగరంలో( China’s Xi’an city)ని వైజెపింగ్‌ గ్రామం(Weiziping village)లో ఈ ఘటన సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 900 ఇళ్లు, రహదారులు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అత్యవసర సేవల విభాగం అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. దాదాపు వెయ్యిమంది సహాయక సిబ్బంది ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

బురద కలిసిన నీటి ప్రవాహం ఒక్కసారిగా వైజెపింగ్‌ గ్రామంపై విరుచుకుపడిందని(a flash flood ‌) ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లలో ఉంటున్న వారు కూడా ఆ వరదలో కొట్టుకుపోయారని వారి ఆచూకీ కూడా తెలియడంలేదని తెలిపారు. ఈ ప్రదేశంలో అందమైన మనోహర దృశ్యాలు ఉండటంతో.. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దీంతో ఇక్కడ అధిక కుటుంబాలు రెస్టారంట్లను నిర్వహిస్తుంటాయని చైనా అధికారిక వార్తా సంస్థ షిన్హూవా పేర్కొంది.

చైనాలోని ఈశాన్య ప్రాంతంలో భారీ ఎత్తున వర్షాలు(Heavy rains) కురుస్తుండటంతో తరచూ భారీగా వరదలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం హెబై రాష్ట్రంలో 29 మంది మృతి చెందగా.. బీజింగ్‌లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది జిలిన్‌ ప్రావిన్స్‌లోని షులాన్‌లో చనిపోయారు. ఒక్క హెబై ప్రావిన్స్‌లోనే 1.5 మిలియన్ల మందిని ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనాలో ఇప్పటి వరకు వరదలతో 2,00,000 నివాసాలు దెబ్బతిన్నాయి. 13 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగినట్టు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.

చైనాలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతుంటే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. ఆయన చివరి సారిగా జులై 31న ఓ సైనిక కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా గురువారం జిన్‌పింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సహా కొందరు నిపుణులతో భేటీ అయ్యారు. 

Tags:    

Similar News