High Alert in USA : అమెరికాలో హై అలర్ట్..ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే ఛాన్స్
ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక మేం ముగింపు ఇస్తాం అని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో అమెరికాలో పాలకులు హై అలర్ట్ ప్రకటించారు. తమపై దాడులకు దిగిన అమెరికాను విడిచిపెట్టేది లేదంటూ ప్రతిజ్ఞ చేస్తున్న ఇరాన్ తప్పకుండా ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్, వాషింగ్టన్ సహా పలు ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రతను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం ప్రత్యక్ష దాడులకు దిగింది. ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన అమెరికా అంతటా నెలకొన్నది. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.
పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశారు. వాషింగ్టన్, న్యూయార్క్ సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు తెలిపారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు నిర్దిష్టమైన లేదా నమ్మదగిన ఎలాంటి బెదిరింపులు లేవని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు మదింపు వేస్తూ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ వెల్లడించారు.