California : కోట్లు ఖర్చుపెట్టి నీళ్లు కొనుక్కుని మంటలు ఆర్పుకుంటున్న హాలీవుడ్ స్టార్స్

Update: 2025-01-13 08:15 GMT

హాలీవుడ్‌ తారలు నివసించే చోటుగా, ‘సిటీ ఆఫ్‌ ఏంజెల్స్‌’గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాస్‌ఏంజెల్స్‌ లో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా వుంది. లాస్‌ఏంజెలెస్‌ ప్రాంతంలో మొదలైన ‘ప్యాలిసేడ్స్‌ వైల్డ్‌ఫైర్‌’ పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఆ మంటలను ఆర్పడానికి ఫైర్‌ సిబ్బంది శక్తికి మించి శ్రమిస్తున్నారు. అయితే నీటి కొరత కారణంగా ఫైర్‌ హైడ్రంట్స్‌ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రావట్లేదు. దీంతో ఈ ముప్పు నుంచి తమ ఇళ్లను కాపాడుకోవడానికి.. హాలీవుడ్‌ ప్రముఖులు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు. అపర కుబేరులు ప్రైవేటు ఫైర్‌ఫైటర్లకు గంటకు రూ.1.72లక్షలు.. అంటే రోజుకు దాదాపు రూ.40లక్షలు కూడా చెల్లించడానికి సిద్ధం అవుతున్నారు.

ప్రముఖులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం వారేనని సామాన్యులు మండిపడుతున్నారు. వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. అక్కడి అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. వాటిలో ముఖ్యమైనది.. ఇంటి చుట్టూ ఉండే పచ్చికకు, మొక్కలకు వారానికి రెండుసార్లు.. అదీ ఒక్కోసారికి 8 నిమిషాల చొప్పున మాత్రమే నీరు పెట్టాలనే నిబంధన వుంది. దాన్ని ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కానీ హాలీవుడ్‌ సెలబ్రిటీల్లో ఒకరైన కిమ్‌ కర్దాషియన్‌ తన ఇంటి తోటకు వాడాల్సినదానికన్నా అదనంగా 8 లక్షల లీటర్లకు పైగా నీటిని వాడారు. కిమ్‌ కర్దాషియన్‌ మాత్రమే కాదు.. లాస్‌ ఏంజెలె్‌సలో నివసించే సిల్వెస్టర్‌ స్టాలోన్‌, ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌, పారిస్‌ హిల్టన్‌, బిల్లీ క్రిస్టల్‌, ఆంథోనీ హాప్కిన్స్‌, మెల్‌ గిబ్సన్‌, తదితర సెలబ్రిటీలు, సంపన్నులందరిదీ అదే పద్ధతి అని తెలుస్తోంది. నీటి కొరతతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఈ సెలబ్రిటీలు అంత విచ్చలవిడిగా నీటిని వాడేయడంపై సామాన్యుల్లో చాలాకాలంగా ఆగ్రహం ఉంది. 

Tags:    

Similar News