Hyderabad Student : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మృతి

Update: 2025-08-12 15:15 GMT

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతురాలు సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీజా వర్మ (25) గా గుర్తించారు. శ్రీజా వర్మ తన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఇటీవలనే ఆమె ఎం.ఎస్. పూర్తి చేసింది. సోమవారం రాత్రి తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు కారులో రెస్టారెంట్‌కు భోజనం చేయడానికి వెళ్లింది. భోజనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమె కారును ఒక ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజా వర్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శ్రీజాతో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఉన్నట్లు సమాచారం.

కుటుంబ నేపథ్యం:

శ్రీజా వర్మ తండ్రి శ్రీనివాస్ వర్మ, తల్లి హేమలత కొన్నేళ్ల క్రితం సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజా వర్మకు చెల్లెలు శ్రేయా వర్మ ఉంది. ఆమె కూడా 20 రోజుల క్రితం ఎం.ఎస్. చదువుల కోసం అమెరికా వెళ్లింది. శ్రీజా మరణ వార్త తెలిసిన కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags:    

Similar News