World Bank: అమెరికాను చేరుకోవాలంటే 75 ఏళ్లు పడుతుందట !
భారత్‌పై వరల్డ్ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు;
అమెరికన్ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత్‌కు మరో 75 ఏళ్లు పడుతుందని ప్రపంచబ్యాంక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతోపాటు 100కిపైగా దేశాలు భవిష్యత్తులో సంపన్న దేశాలుగా అవతరించడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటాయని తెలిపింది. ప్రపంచ అభివృద్ధి నివేదిక – 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది.
ప్రపంచబ్యాంక్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే అమెరికన్ల తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి చైనాకు పదేళ్లకు పైగా, ఇండోనేషియాకు 70 ఏళ్లకుపైగా , భారత్‌కు 75 ఏళ్లు పడుతుందని ప్రపంచబ్యాంక్ నివేదిక వెల్లడించింది. గత 50 ఏళ్ల అనుభవాల నుంచి తీసుకున్న గుణపాఠాల ప్రకారం దేశాలు సంపన్నంగా ఎదుగుతున్నాయని వివరించింది. కానీ అమెరికన్ వ్యక్తిగత తలసరి జీడీపీ రోజుకు 8000 డాలర్లు. ఆయా దేశాల పౌరుల తలసరి జీడీపీ పది శాతమని వివరించింది. ఈ దేశాలన్నీ మధ్య ఆదాయ ట్రాప్ లోనే చిక్కుకున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. వీటిని మధ్యాదాయ దేశాలుగా వర్గీకరించింది.
వ్యక్తిగత తలసరి అభివృద్ధి ప్రకారం 2023 చివరికల్లా 108 దేశాలు మధ్యాదాయ దేశాలుగా నిలిచాయి. ప్రతి దేశంలో ప్రతి పౌరుడి తలసరి జీడీపీ 1136 డాలర్ల నుంచి 13,845 డాలర్ల మధ్య నిలుస్తుంది. ప్రపంచ జనాభాలో 75 శాతం జనాభా 600 కోట్ల మంది ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. వీటిల్లో మూడింట రెండొంతల మంది పేదరికంలో జీవిస్తున్నారు’ అని ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. 1990 నుంచి కేవలం 34 మాత్రమే మధ్యాదాయ దేశాల స్థాయి నుంచి అధికాదాయ దేశాలుగా మారాయి. వాటిల్లో యూరోపియన్ యూనియన్ గ్రూపు దేశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది.