India China Border: ఇక చైనా నక్కజిత్తులు పనిచేయవు.. మన 'రూపా' ఏఐని తెచ్చేసింది!

India China Border: టెక్నాలజీ ఉండగా భయమెందుకు దండగా అన్నట్టున్నాయి ఈరోజులు.

Update: 2021-10-26 02:36 GMT

India China Border: టెక్నాలజీ ఉండగా భయమెందుకు దండగా అన్నట్టున్నాయి ఈరోజులు. ఏది కావాలన్నా టెక్నాలజీ, ఏం చేయాలన్నా టెక్నాలజీ.. ఇలా మన రోజూవారీ జీవితాలు టెక్నాలజీ లేకుండా గడవలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికీ ఎంతోమంది ఈ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు సృష్టించారు. తాజాగా అలాంటి ఓ అద్భుతాన్నే చేయనున్నారు భారత సైనికులు. సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలు కనుక్కోవడానికి భారత సైనికులు ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు.

ఇటీవల భారత, చైనా సరిహద్దుల్లో దుమారం రేగుతోంది. మునుపటి కంటే ఈమధ్య కాల్పులు, గొడవలు ఎక్కువయ్యాయి. అందుకే చైనా ఆటలను అరికట్టడానికి భారత సైన్యం ఓ నిర్ణయం తీసుకుంది. దేశం తూర్పు విభాగంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది.

మానవరహిత విమానాలు, రాడార్లు భారత సైన్యానికి శత్రుదేశ కదలికలను గుర్తుపట్టడానికి ఎప్పటినుండో సాయం చేస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఆర్టిఫీషియల్ టెక్నాలజీ (ఏఐ) బరిలోకి దిగనుంది. దీని సాయంతో మనుషుల కదలికలు మాత్రమే కాదు జంతు కదలికలు కూడా కనుక్కోవచ్చు. ఏఐ ద్వారా వచ్చే సమాచారాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 'రూపా'లో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రంలో విశ్లేషిస్తుంటారు.

భవిష్యత్తు యుద్ధాలన్నీ సైబర్‌ యుద్ధాలే అన్న వాదనలు ఇప్పటికే మొదలయ్యాయి. అందుకే ఈ యుద్ధ కదలికలను గుర్తించడం కోసం ఏఐ సాయం తీసుకోవడం మేలు అనుకుంటోంది భారత సైన్యం. కేవలం కదలికలను కనిపెట్టడానికి మాత్రమే కాదు కృత్రిమ మేధ ఆధారిత ఆయుధాలను దింపడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. కానీ అవి ప్రవేశపెట్టడానికి కనీసం మూడు, నాలుగేళ్లు పడుతుంది అంటున్నారు నిపుణులు.

ఈ ఏఐను ఉపయోగించుకుని ముఖాలను గుర్తుపట్టే సాఫ్ట్‌వేర్ కూడా త్వరలోనే అమల్లోకి రానుంది. అస్సాం ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇజ్రాయెల్‌ సంస్థ కోర్‌సైట్‌ ఏఐలు కలిసికట్టుగా ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయనున్నాయి. డీఆర్‌డీవో సంస్థలు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు కొన్నింటిని ఇప్పటికే తయారు చేశాయి. వీటిల్లో శత్రుస్థావరాల పరిశీలన, నిఘా పెట్టే ఓ రోబో ఉంది.

యుద్ధం లేదా ఘర్షణల్లో గాయపడ్డ సైనికులను వేగంగా యుద్ధభూమి నుంచి బయటకు తరలించేందుకు స్మార్ట్‌ వీల్ చైర్‌లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇలా టెక్నాలజీని ఉపయోగించి బోర్డర్‌లో మన సైనికులు శత్రుదేశాలను ఎత్తుజిత్తులను మట్టుపెట్టే పనిలో ఉన్నారు.

Tags:    

Similar News