Kshama Sawant: క్షమా సావంత్‌కు వీసా తిరస్కరించిన భారత్!
మద్దతుదారులు ఆందోళన;
అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న భారత కాన్సులేట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు (Kshama Sawant) అత్యవసర వీసా నిరాకరించడంతో ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ శాంతిభద్రతల సమస్య నెలకొందని, వెంటనే స్థానిక అధికారులను పిలవాల్సి వచ్చిందని భారత కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి.
‘‘ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వెళ్లిపోవాలని అనేకసార్లు సూచించినప్పటికీ.. అందుకు వారు నిరాకరించారు. అంతేకాకుండా కాన్సులేట్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు బెదిరింపులకు దిగారు. దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది’’ అని సియాటెల్‌లోని భారత కాన్సులేట్ పేర్కొంది. అయితే, ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఇదే వ్యవహారంపై సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్ సామాజిక మాధ్యమంలో స్పందించారు. తిరస్కరణ జాబితాలో తన పేరు ఉందని పేర్కొంటూ వీసా నిరాకరించారన్నారు. ఈ క్రమంలోనే మూడుసార్లు తన వీసా నిరాకరించినందుకు గల కారణాలు తెలపాలంటూ తన మద్దతుదారులతో కలిసి భారత కాన్సులేట్ ముందు శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు.
ఇదిలా ఉంటే, క్షమా సావంత్‌కు భారత్ వీసా నిరాకరించడం ఇదే తొలిసారి కాదు. బెంగళూరులో ఉంటున్న ఆమె తల్లి దగ్గరకు వెళ్లేందుకు సావంత్ గతంలో ప్రయత్నించినప్పటికీ వీసా మంజూరు కాలేదు. కానీ, ఆమె భర్త కాల్విన్ ప్రీస్ట్‌కు మాత్రం వీసా లభించింది.