Indian shot dead in US : అమెరికా స్టోర్‌లో కాల్పులు, భారత సంతతి వ్యక్తి మృతి

మరో ఘటన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి;

Update: 2024-08-18 02:15 GMT

అమెరికాలో తుపాకీ విష సంస్కృతికి భారత సంతతికి చెందిన మరో వ్యక్తి మరణించాడు. ఉత్తర కరోలినాలోని విమానాశ్రయ రోడ్డు సమీపంలో పొగాకు స్టోర్‌లో బాలుడు జరిపిన కాల్పుల్లో దుకాణం యజమాని మైనాంక్‌ పటేల్‌   మరణించినట్లు అధికారులు తెలిపారు. గత మంగళవారం తుపాకీతో పొగాకు దుకాణంలోకి ప్రవేశించిన నిందితుడు మైనాంక్‌పై పలుమార్లు కాల్పులు జరిపి పరారయ్యాడన్నారు. మైనాంక్‌ను ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. దుకాణంలోని సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దుకాణంలో దోపిడి చేసిన బాలుడు అనంతరం యజమానిపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. మైనాంక్‌ భార్య ఏడున్నర నెలల గర్భిణి. వారికి ఐదేళ్ల చిన్నారి సైతం ఉంది. 

మరో ఘటనలో అమెరికాలో తెలంగాణకు చెందిన రాజేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రాజేష్ మృ‌తికి కారణమేంటో తెలియలేదు. మ‌ృతదేహం స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధిత కుటుంబం కోరుతోంది. అలాగే మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.తెలంగాణలోని హనుమకొండకు చెందిన ఆరుకొండ రాజేష్.. 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడినే చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల మృతిచెందాడు. మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే కుమారుడి ఎలా చనిపోయాడో తెలియక తల్లడిల్లుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం పుచ్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాజేష్ తండ్రి కూడా ఇటీవల చనిపోయారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు సహకరించాలని రాజేష్ తల్లి, సోదరి కోరుతున్నారు.

Tags:    

Similar News