Indian origin techie: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య..
మామలా కనిపిస్తున్నాడనే కారణంతో హత్య;
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. టెక్సాస్‌లోని ఆస్టిన్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న అతడిపై మరో భారతీయుడు కత్తితో పొడిచి చంపేశాడు.
ఆస్టిన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన అక్షయ్ గుప్తా (30) హెల్త్- టెక్ స్టార్టప్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. అతను మే 14వ తేదీన ఆస్టిన్‌లో బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో 31 ఏళ్ల దీపక్ కుందల్ అనే భారతీయుడు గుప్తాను కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని అక్షయ్ గుప్తాను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గుప్తా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. గుప్తా మెడపై నిందితుడు కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆస్టిన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు దీపక్ కండేల్ చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్షయ్ గుప్తా తన మామలా కనిపించాడని, అందుకే కత్తితో పొడిచి చంపానని కండేల్ పోలీసుల విచారణలో చెప్పాడు. అక్షయ్ గుప్తా ప్రతిభావంతుడైన విద్యార్థి. ఆయన పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కూడా కలిశారు.