అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) మధ్య తొలిసారిగా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వలస విధానం, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పనపై ప్రశ్నలు సంధించుకుని పరస్పరం విమర్శించుకున్నారు. ఒకరినొకరు అబద్ధాలు కోరుగా అభివర్ణించుకున్నారు. ఈ 90 నిమిషాల చర్చలో 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ ఒకరిపైనొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇద్దరు లీడర్లు. అట్లాంటాలో గురువారం లైవ్ డిబేట్ లో ఇరు పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. డిమోక్రటిక్ పార్టీ నేత జోబైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మధ్య జరిగిన ఈ డిబేట్ ను అమెరికన్లతో సహా వివిధ దేశాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈసారి కూడా వారిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. తమ అభ్యర్థిత్వాలను పరీక్షించుకునేందుకు వాళ్లకి ఇదొక పరీక్షగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.
మరో డిబేట్ సెప్టెంబర్ 10న జరగనుంది. దానిని ఏబీసీ సంస్థ నిర్వహించనుంది. ఇక ఉపాధ్యక్షుడు డిబేట్ కూడా సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు. అభ్యర్థులిద్దరు వృద్ధాప్యంలో ఉండటం వల్ల ఇరు పార్టీల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుంది.