మయన్మార్‌లో ఇంటర్నెట్ నిలిపివేత
సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన సైన్యం.. ఐదు రోజుల క్రితం ఫేస్‌బుక్‌ను నిషేధించింది.;
మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకుని దేశ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ సహా పలువురు కీలక నేతలను నిర్బంధించిన మిలటరీ.. దేశంపై మరింత పట్టు బిగిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలపై ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన సైన్యం.. ఐదు రోజుల క్రితం ఫేస్‌బుక్‌ను నిషేధించింది.
తాజాగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను పర్యవేక్షించే 'నెట్‌బ్లాక్స్' ధ్రువీకరించింది..దేశప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్‌ను నిషేధించినట్టు చెప్పిన సైన్యం.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను కూడా నిలిపివేసింది. సేవలను నిలిపివేయడంపై స్పందించిన ఆయా సంస్థలు.. మిలటరీ చర్య ప్రజల హక్కుల ఉల్లంఘనేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిషేధించిన సైన్యం తర్వాత దానిని పునరుద్ధరించింది. అయితే సోషల్ మీడియాలో సైన్యంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఇప్పుడు పూర్తిగా ఇంటర్నెట్‌ను నిషేధించారు. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో దానికి సంబంధించిన చిత్రాలు, నిరసనలు వెల్లువెత్తడంతో సైన్యం ఫేస్‌బుక్‌పై నిషేధం విధించింది.
గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ అవకతవకలకు పాల్పడిందని సైన్యం ఆరోపించింది. వాటిపై అధికారపార్టీ సరైన రీతిలో స్పందించకపోవటంతో తిరుగుబాటు చేసినట్లు సైన్యం వెల్లడించింది.