Israeli - Gaza: గాజా పై మళ్లీ ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి
హమాస్ ఉగ్రవాదులే లక్ష్యమని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్) గాజాను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా డిఫెన్స్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.
గాజా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గాజా నగరంలో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో మరో 10 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్యను హమాస్ వర్గాలు ధ్రువీకరించాయి.
అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ దేశంపై దాడి చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారన్న సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఈ స్ట్రైక్స్ జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో గాజా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.