Israel: ఇజ్రాయెల్‌పై సరికొత్త క్షిపణిని ప్రయోగించాం: ఇరాన్
తీవ్రమైన యుద్ధం..;
ఇజ్రాయెల్‌పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశానికి చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని తెలిపింది. ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాస్సీం గైడెడ్ బాలిస్టిక్ మిసైల్‌ను వినియోగించారు.
ఇరాన్ రక్షణ మంత్రి అజిజ్ నసీర్‌జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ వద్ద సరికొత్త బాలిస్టిక్ మిసైల్ సిద్ధమైందని ప్రకటించారు. అది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించుకొని వెళ్లగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ వీటిని కూడా వినియోగిస్తోంది. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లుగా ఇరాన్ పేర్కొంది. దీని వార్ హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని.. అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. దీనికి ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు చెప్పింది. కాకపోతే దీనిని కచ్చితంగా ఏ ప్రదేశంపై ప్రయోగించిందో మాత్రం వెల్లడించలేదు.
నిన్న రాత్రి ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 200 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. బెట్‌యాప్ ప్రాంతంలో దాదాపు 35 మంది ఆచూకీ గల్లంతైందని ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నది. క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశంపై విరుచుకుపడుతున్నది. దీంతో జెరూసలేం, టెల్ అవీవ్‌లో అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తికి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. కాగా, ఇరాన్ దాడుల్లో నలుగురు చనిపోయినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఇరాన్‌తో పోరు రోజుల్లో ముగిసేదికాదు: అమెరికా
ఇరాన్‌తో మొదలైన సంక్షోభం రోజుల్లో ముగిసే విషయం కాదని అమెరికా శ్వేతసౌధం, ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. దీనికి కొన్ని వారాల సమయం పట్టొచ్చన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్‌కు అమెరికా అనుమతి పరోక్షంగా లభించినట్లు వారు పేర్కొన్నారు.