Hamas Israel Conflict: నెత్తురోడుతున్న గాజా
నలుగురు బందీల విడుదల కోసం జరిగిన ఆపరేషన్‌లో 274 మంది మృతి;
హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లిన వారి కోసం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం అణువణువూ జల్లెడపడుతోంది. భారీ ఎత్తున బాంబు దాడులకు పాల్పడుతోంది. 246 రోజుల తర్వాత శనివారం నలుగురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం విడిపించగా అందులో నోవా అరగమణి అనే యువతి తన తండ్రి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
హమాస్ మిలిటెంట్ సంస్థ బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ పౌరులను విడిపించేందుకు గాజాలో పెద్ద ఎత్తున పోరు సాగుతోంది. హమాస్ చెరలో చిక్కుకున్న బందీలను రక్షించడమే లక్ష్యంగా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం హమాస్ చెరలో ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి వీరిని ప్రత్యేక దళాలు కాపాడాయని తెలిపింది. ఈ నలుగురిని మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. బందీలకు వైద్య పరీక్షల అనంతరం హెలికాప్టర్ ద్వారా వారి స్వస్థలాలకు ఇజ్రాయెల్ సైన్యం తరలించింది. 246 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి విడుదలవడంపై బందీలు ఆనందం వ్యక్తం చేశారు.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి 251 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. వీరిలో కొంతమందిని నవంబరులో జరిగిన కాల్పుల విరమణ సమయంలో హమాస్ విడిచిపెట్టింది. ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది. బందీలను రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో భారీగా పాలస్తీనియన్లు మృతి చెందారు.
హమాస్ చెర నుంచి విడుదలైన నోవా అరగమణి..టెల్ అవివ్‌లో తన తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ తన తండ్రి పుట్టినరోజును ఆమె జరుపుకుంది. ఇద్దరు కలిసి అక్కడ కేక్ కట్ చేశారు. నోవాను ఇద్దరు హమాస్ మిలిటెంట్లు బైక్‌పై కూర్చోబెట్టుకుని ఎత్తుకెళ్లారు. తనను చంపవద్ద అంటూ ఆమె కేకలు వేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది.
మరోవైపు సెంట్రల్ గాజాలోని అర్బన్ బురీజ్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఆదివారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు బందీలను విడిపించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో నుసిరత్ శిబిరంపై ఇజ్రాయెల్ భారీ బాంబు దాడి చేసింది. ఈ దాడిలో మృతిచెందిన వారికి పాలస్తీనియన్లు అంత్యక్రియలు నిర్వహించారు