Netanyahu: అరెస్ట్ భయంతో వేరే మార్గంలో వెళ్లిన నెతన్యాహు
అమెరికా వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లారు. ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాల్లో శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి అమెరికాకు చేరుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి. నెతన్యాహుపై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన ఐరోపా మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం తెలిసింది.
ఇజ్రాయెల్ విమానాలు అమెరికా వెళ్లాలంటే ఎప్పుడూ ఐరోపా గగనతలం మీదుగానే వెళ్తుంటాయి. ఈసారి నెతన్యాహు ప్రయాణించిన ‘వింగ్స్ ఆఫ్ జియాన్’ విమానం మాత్రం ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లినట్లు తెలిసింది. గ్రీస్, ఇటలీ శివారు ప్రాంతాల పైనుంచి మధ్యధరా సముద్రం దాటి అక్కడి నుంచి జీబ్రాల్టర్ జలసంధి మీదుగా అట్లాంటిక్ గగనతలంలోకి వెళ్లినట్లు తేలింది. దీంతో ప్రయాణ దూరంతో పాటు సమయం కూడా భారీగా పెరిగినట్లు విమానయాన నిపుణులు చెబుతున్నారు. సాధారణ మార్గం కంటే 373 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించి నెతన్యాహు అమెరికా వెళ్లినట్లు గుర్తించారు.
గాజాపై యుద్ధం నేపథ్యంలో నెతన్యాహు, మాజీ రక్షణమంత్రి యోవ్ గాలంట్‌లపై 2024, నవంబర్‌లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఐసీసీ సభ్యదేశాల్లోకి అడుగుపెడితే అరెస్ట్ చేసే ముప్పు పొంచి ఉంది. గతంలో ఐర్లాండ్ స్పందిస్తూ నెతన్యాహు తమ భూభాగంలోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని వెల్లడించింది. ఫ్రాన్స్ మాత్రం అలాంటి పని చేయబోమని తెలిపింది. ఇక అలాంటి ఆలోచనలే లేవని ఇటలీ పేర్కొంది. అయినా కూడా నెతన్యాహు ప్రత్యామ్నాయ మార్గంలో అమెరికాకు వెళ్లారు. శుక్రవారం యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగించనున్నారు. అనంతరం వాషింగ్టన్ వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలవనున్నారు.