ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు గత కొంతకాలంగా ప్రొస్టేట్ గ్రంథి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వాపు కారణంగా మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం శస్త్ర చికిత్స చేయించుకున్నారు. నెతన్యాహుకు జెరూసలెం లోని హడస్సా మెడికల్ సెంటర్‌లో సర్జరీ జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు ఆస్పత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రధాని నెతన్యాహు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. ఆయన ఎలాంటి క్యాన్సర్ బారిన పడలేదని వెద్యులు ప్రకటించారు. అయితే కొన్ని రోజులపాటు వైద్యుల పరిశీలనలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, నెతన్యాహు ప్రొస్టేట్ గ్రంథి సమస్యతో బాధపడుతున్నట్లు ప్రధాని కార్యాలయం రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరిగిన కారణంగా మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారని.. ప్రొస్టేట్‌ను తొలగించేందుకు సర్జరీ అవసరం అయినట్లు వెల్లడించింది. ఆదివారం శస్త్రచికిత్స ఉంటుందని.. అనంతరం కొన్ని రోజులపాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు.
నెతన్యాహు కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని అధికారులు తెలిపారు. ఓ వైపు హమాస్‌తో కాల్పుల విరమణచర్చలు మరోవైపు యెమెన్ నుంచి హౌతి రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం అక్కడి ప్రజల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తోంది.