Italy Road Accident: ఇటలీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

Update: 2025-10-07 01:45 GMT

ఇటలీలో నలుగురు భారతీయులు మృతి చెందారు. దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారని రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. మృతులు మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, వారి కారు ట్రక్కును ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు..

పలు నివేదికల ప్రకారం.. గత శనివారం స్కాన్జానో జోనికో ప్రాంతంలో 10 మందితో ప్రయాణిస్తున్న ఏడు సీట్ల కారు ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 ఉండగా, అక్కడికక్కడే నలుగురు భారతీయులు మృతి చెందారు, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుమార్ మనోజ్ (34), సింగ్ సుర్జీత్ (33), సింగ్ హర్విందర్ (31), సింగ్ జస్కరన్ (20) గా గుర్తించారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది.

ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను తెలుసుకోడానికి స్థానిక ఇటాలియన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు, సంబంధిత కుటుంబాలకు రాయబార కార్యాలయం అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తుందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. గాయపడిన వారిలో ఐదుగురిని పోలికోరో (మటేరా)లోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ఆరవ వ్యక్తిని పోటెంజాలోని శాన్ కార్లో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

గతంలో ఇటలీలోని గ్రోసెటో సమీపంలోని ఆరేలియా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగ్‌పూర్ వ్యాపారవేత్త, ఆయన భార్య మరణించారు. ప్రమాదంలో వారి పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను నాగ్‌పూర్‌కు చెందిన ప్రసిద్ధ హోటల్ వ్యాపారి జావేద్ అక్తర్, ఆయన భార్య నాదిరా గుల్షన్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారి కుమార్తె అర్జూ అక్తర్, మరో కుమార్తె షిఫా, కుమారుడు జాజెల్‌లను ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News