Jaish-e-Mohammed: మళ్లీ చురుగ్గా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ..!
ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం;
పాకిస్థాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. పహల్గామ్ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్ ఈ ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ దీని కోసం ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించాడు. విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ కి 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్ చాలా కాలంగా ఉగ్రవాద సంస్థ సైద్ధాంతిక, శిక్షణ కేంద్రంగా ఉంది.
అయితే.. సోషల్ మీడియాలో ఉర్దూలో షేర్ చేయబడిన ఒక పోస్ట్ ప్రకారం.. జెఎం తన ప్రధాన కార్యాలయం – జామియా మసీదు సుభాన్ అల్లాహ్ పునరుద్ధరణ కోసం తెలివిగా విరాళాలను కోరింది. “అందరూ ఐక్యంగా, కలిసి పనిచేయాలి. అలాగే, డబ్బు వసూలు చేసేటప్పుడు, ఎవరు ఎంత విరాళం ఇచ్చారో ఎవరికీ వెల్లడించకూడదని గుర్తుంచుకోండి. ఈ ప్రచారం ద్వారా భూమిపై కొన్ని ప్రాంతాలు స్వర్గంలా మారుతాయి. అమరవీరుల మసీదులకు వైభవం తిరిగి వస్తుంది. జిహాద్ మార్గాన్ని అనుసరించడానికి ఆసక్తి ఉన్న వాళ్లకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.” అని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత భద్రతా దళాలు తమ బలాన్ని ప్రదర్శించి ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో జైషే మహ్మద్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. సైన్యం బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం అయిన సుభాన్ అల్లాహ్ మసీదును భారత సైన్యం కూల్చివేసింది. ఈ వైమానిక దాడిలో ఉగ్రవాదులకు శిక్షణ అందించే స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఆపరేషన్‌లో మసూద్ అజార్ కుటుంబంతో సహా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.