ఆత్మాహుతి దాడులు..అట్టుడుకుతున్న అఫ్గన్.. 103 చేరిన మృతుల సంఖ్య
Afghanistan: అఫ్గానిస్థాన్ భయానకంగా మారిపోయింది. ప్రాణభయంతో దేశం నుంచి పారిపోతున్న వారిని కూడా ఉగ్రవాదులు వదలడంలేదు.;
representational photo
Afghanistan: అఫ్గానిస్థాన్ భయానకంగా మారిపోయింది. ప్రాణభయంతో దేశం నుంచి పారిపోతున్న వారిని కూడా ఉగ్రవాదులు వదలడంలేదు. కాబుల్ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 103కు పెరిగింది. ఈ దాడిలో 13మంది అమెరికా సైనికులు మరణించగా.. 90 మంది అఫ్గాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. అటు.. ఐసిస్‌ను వదిలే ప్రసక్తే లేదని అమెరికా హెచ్చరించింది. ఐసిస్ అంతు చూస్తామని అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తేల్చిచెప్పారు.
కాబుల్ విమానాశ్రయంలో ఐసిస్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 150 మంది గాయపడగా... అందులో కొందరి పరిస్థితి విషమిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రదాడిలో గాయపడిన వారి సంఖ్య 150కి చేరిందని కాబుల్ అధికారులు వెల్లడించినట్టు... వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. అటు.. దాడికి ఐఎస్‌ఐఎస్-ఖోర్సా బాధ్యత తీసుకొంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు. అఫ్గాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఈ ఘటనపై స్పందించారు. తాలిబన్లు- హక్కానీ నెట్‌వర్క్‌ల్లో ఐసిస్-కె మూలాలు ఉన్నాయని అన్నారు. కానీ తాలిబన్లు ఈ విషయాన్ని తిరస్కరించడం సరికాదని అన్నారు. ఒకప్పుడు క్వెట్టా షురా అనే మిలిటెంట్ సంస్థతో సంబంధాలు లేవని పాక్ చెప్పినట్టయింది. తన గురువు నుంచి తాలిబన్లు చాలా నేర్చుకున్నారని ట్వీట్ చేశారు.
కాబుల్ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకన్‌జీ ప్రకటించారు. ఈ సారి రాకెట్లు.. వాహన బాంబులతో ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. శ్వేత సౌధంపై అమెరికా పతాకాన్ని ఆగస్టు 30 సాయంత్రం వరకు సగం ఎత్తులోనే ఎగరవేయనున్నారు. కాబుల్‌లో జరిగిన దాడిలో మృతిచెందిన వారికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాబుల్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..., ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్ ఆదేశించారు. ఈ నెల 31 నాటికి అఫ్గాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని పునరుద్ఘాటించారు.
అటు... కజికిస్తాన్‌లోనూ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. దక్షిణ జంబిల్‌లోని మిటలరీ ప్రాంతంలో భారీ పేలుడికి ఉగ్ర మూకలు తెగబడ్డాయి. ఈ ఘటనలో 9మంది సైనికులు మృతి చెందగా.. 80 మందికి పైగా గాయపడ్డారు. మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో.. సైనికులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.