Earthquake: టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం

కూలిన భవనాలు, 20 మందికి పైగా గాయాలు

Update: 2025-10-28 02:30 GMT

పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సుల్లో భూకంపం సంభవించింది. ప్రకంపనలు కారణంగా పలు భవనాలు కూలిపోయాయి. మూడు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణంలో 6.1 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైందని విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ ఏఎఫ్‌ఏడీ(AFAD) తెలిపింది. 3.72 మైళ్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. సిందిర్గిలో మూడు ఖాళీ భవనాలు, రెండంతస్తుల దుకాణం కూలిపోయాయని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ వెల్లడించారు. గతంలో వచ్చిన భూకంపంలోనే ఈ నిర్మాణాలు దెబ్బతిన్నాయని.. తాజా ప్రకంపనలకు కూలిపోయాయని చెప్పారు.

బలికేసిర్ గవర్నర్ ఇస్మాయిల్ ఉస్తావోగ్లు ప్రకారం.. భూప్రకంపనలకు 22 మంది గాయపడినట్లు తెలిపారు. భయాందోళనలకు గురి కావడంతోనే ఇలా జరిగిందని వెల్లడించారు. అయితే ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

టర్కీలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 53,000 మందికి పైగా మృతి చెందారు. దక్షిణ, ఆగ్నేయ ప్రావిన్సులలో లక్షలాది భవనాలు ధ్వంసమయ్యాయి. పొరుగున ఉన్న సిరియా ఉత్తర ప్రాంతాల్లో మరో 6,000 మంది మరణించారు.

Tags:    

Similar News