Elon Musk Vs Mark Zuckerberg : అంతా తూచ్.. ఫైటే లేదు..

ఎలాన్ మస్క్-జుకర్ బర్గ్ క్రేజీ ఫైట్ లో కొత్త ట్విస్ట్;

Update: 2023-08-14 07:30 GMT

వ్యాపార దిగ్గజాలైన మార్క్‌ జుకర్‌ బర్గ్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య కేజ్‌ ఫైట్‌ జరిగే రోజు కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్న నేపథ్యంలో మెటా అధినేత మార్క్‌ సంచలన పోస్టు చేశారు. కేజ్‌ ఫైట్‌ జరుగుతుందన్న ఊహ నుంచి బయటకు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. దీనికి ఎలాన్‌ మస్కే కారణమన్నారు. అయితే జుకర్‌ బర్గ్‌ ఆరోపణలకు మస్క్‌ తనదైన వ్యంగ్యంతో సమాధానం ఇచ్చారు. కేజ్‌ ఫైట్‌లో తలపడనున్నట్లు ప్రకటించిన ప్రపంచ కుబేరులు, దిగ్గజ వ్యాపారవేత్తలు మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఎలాన్‌మస్క్‌ ల మధ్య మామూలు యుద్ధం కాదు గాని మాటలు యుద్ధం మాత్రం కొనసాగుతోంది.

తనతో కేజ్‌ఫైట్‌కు మస్క్‌ డేట్లు ఇవ్వడంలేదని జుకర్‌ బర్గ్‌ ఆరోపిస్తుండగా అతడి ఇంటి తలుపు తట్టడానికి రేపటి వరకు తాను వేచి ఉండలేనని మస్క్‌ అన్నారు. అయితే టెస్లా అధినేత తనతో కేజ్‌ఫైట్‌ను చాలా తేలిగ్గా తీసుకున్నారని ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానని మెటా బాస్‌ పేర్కొన్నారు.


తనతో పోరాటానికి దిగేందుకు మస్క్‌కు డేట్‌ను సూచించాననీ, కానీ మస్క్‌ మాత్రం ఇప్పటి వరకు దానిని ప్రతిపాదించలేదనీ, ఆయనకు శస్త్ర చికిత్స అవసరమని చెప్పారని ఆరోపించారు. ఇంటి పెరట్లో ప్రాక్టిస్‌ రౌండ్‌ ఆడదామంటున్నారని వివరించారు. అతనికి నిజంగా తనతో తలపడాలని ఉంటే, నన్ను సంప్రదించడం ఎలాగో మస్క్‌కు తెలుసన్నారు. జుకర్‌ బర్గ్‌ తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం థ్రెడ్స్‌లో చేసిన పోస్టుపై తన ఎక్స్‌ మాధ్యమం ద్వారా మస్క్‌ స్పందించారు. జుకర్‌ బర్గ్‌ను మస్క్‌ కోడితో పోల్చారు. జులైలో మెటాస్ థ్రెడ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ప్రారంభం తర్వాత 52 ఏళ్ల మస్క్ 39 ఏళ్ల జుక్‌ మధ్య బహిరంగ పోటీ తీవ్రమైంది. ట్విట్టర్‌ మాదిరిగానే రూపొందించిన థ్రెడ్స్‌ యాప్‌కు కొన్ని వారాల వ్యవధిలోనే 100 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ వచ్చాయి.

Tags:    

Similar News