Masood Azhar: మా వద్ద వేలాది సూసైడ్‌ బాంబర్లు.. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ప్రకటన..

భయపెట్టే ప్రకటన చేసిన జైషే ఉగ్రవాది మసూద్ అజార్..

Update: 2026-01-12 00:45 GMT

 పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) అధిపతి మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతను వణికించే ప్రకటన చేశాడు. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నారని ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. మసూద్ అజార్‌ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాది. భారత్‌పై దాడులు చేసేందుకు వీరంతా కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.

‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు, వెయ్యి మంది కాదు, వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వీరు భారతదేశంలోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ యోధుల సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుంది’’ అని చెబుతున్నట్లు ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి, అమరవీరులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని అజార్ చెప్పాడు.

అజార్ భారత్‌పై విషంకక్కడమే పనిగా పెట్టుకున్నాడు. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో.. పాకిస్తాన్‌లోని బలవల్పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసినా కూడా బుద్ధి రావడం లేదు. ఈ దాడిలో అజార్ కుటుంబానికి చెందిన చాలా మంది హతమయ్యారు. మసూద్ అజార్ 2019 నుంచి బహిరంగంగా కనిపించడం లేదు.

Tags:    

Similar News