Oil Crisis : మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. రోజుకు 1.3 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా కట్.. భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?

Update: 2026-04-24 10:01 GMT

Oil Crisis : పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధజ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రంగాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా మారుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద రాకపోకలు నిలిచిపోవడంతో రోజువారీ చమురు ఉత్పత్తిలో మునుపెన్నడూ లేని విధంగా భారీ కోత పడింది.

చరిత్రలోనే అతిపెద్ద సరఫరా షాక్

అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) తాజా నివేదిక ప్రకారం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్‌లోకి రావాల్సిన రోజువారీ చమురు సరఫరాలో 1.3 కోట్ల (13 మిలియన్) బ్యారెళ్ల కోత పడింది. ఇది ప్రపంచ చమురు సరఫరా చరిత్రలోనే అతిపెద్ద కుదుపుగా నిపుణులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడం, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడమే దీనికి ప్రధాన కారణం.

పడిపోయిన ఉత్పత్తి - ఆందోళనలో దేశాలు

మార్చి నెలలో ప్రపంచ చమురు ఉత్పత్తి రోజుకు 10.1 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గింది. ముఖ్యంగా ఒపెక్ (OPEC) ప్లస్ దేశాల ఉత్పత్తి 9.4 మిలియన్ బ్యారెళ్లు తగ్గగా, ఇతర దేశాల నుంచి వచ్చే సరఫరా కూడా 7.7 లక్షల బ్యారెళ్ల మేర పడిపోయింది. మార్చిలో మొత్తం 360 మిలియన్ బ్యారెళ్ల లోటు ఏర్పడగా, ఏప్రిల్ నాటికి ఇది 440 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందని అంచనా. అంటే రానున్న రోజుల్లో చమురు కొరత మరింత తీవ్రం కానుంది.

భారత్‌కు ఎందుకు ముప్పు?

భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ సింహభాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. మనకు వచ్చే ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎరువులు, పెట్రోకెమికల్స్ అన్నీ హోర్ముజ్ జలసంధి గుండానే రావాలి. ఈ మార్గం మూసుకుపోయినా లేదా ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగినా షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.

చమురు మాత్రమే కాదు.. ఎరువులకూ కష్టమే

ఈ సంక్షోభం కేవలం ఇంధనానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే సల్ఫర్‌లో 77%, హైడ్రోకార్బన్ ఉత్పత్తులలో 57%, నైట్రోజన్ ఎరువులలో 29.2% ఈ హోర్ముజ్ మార్గం ద్వారానే సరఫరా అవుతాయి. దీనివల్ల వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే అల్యూమినియం షీట్లు, స్టీల్ స్ట్రక్చర్స్, సింథటిక్ రబ్బర్ వంటి పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా గొలుసు కూడా దెబ్బతింటుంది. మొత్తం మీద ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News