Russia Gold : రష్యా కొంపముంచుతున్న యుద్ధం.. బడ్జెట్ లోటు పూడ్చేందుకు అమ్మకానికి 22 టన్నుల బంగారం.
Russia Gold : ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై ఐదేళ్లు గడుస్తున్నా.. రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ, లోలోపల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలవుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధ ఖర్చులను భరించడానికి, పెరుగుతున్న బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మకానికి పెట్టింది. 2026లో ఇప్పటివరకు రష్యా ఏకంగా 22 టన్నుల బంగారాన్ని విక్రయించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బంగారం అమ్మకానికి అసలు కారణం
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా రక్షణ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ ఆంక్షలు, ఇంధన ధరల ఒడిదుడుకులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. మార్చి చివరి నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ భారీ లోటును భర్తీ చేయడానికి రష్యా సెంట్రల్ బ్యాంక్ తన నిల్వల నుంచి 21.8 టన్నుల (సుమారు 22,000 కిలోలు) బంగారాన్ని విక్రయించింది. కేవలం మార్చి నెలలోనే 6.22 టన్నుల బంగారాన్ని అమ్మడం గమనార్హం.
రికార్డు ధరలు రష్యాకు ప్లస్ పాయింట్
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రష్యా భారీగా బంగారాన్ని విక్రయించినప్పటికీ, ఆ దేశ పసిడి నిల్వల మొత్తం విలువ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. జనవరిలో ఔన్స్ బంగారం ధర 5,500 డాలర్లు దాటిన సమయంలో రష్యా 3 లక్షల ఔన్సుల బంగారాన్ని అమ్మి దాదాపు 1.4 నుంచి 1.68 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. అంటే ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ బంగారం అమ్మి ఎక్కువ లాభం పొందిందన్నమాట.
పెరిగిన డిమాండ్ - చైనాతో డీల్స్
ఒకవైపు ప్రభుత్వం బంగారాన్ని అమ్ముతుంటే, మరోవైపు రష్యాలోని సాధారణ ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని భద్రపరుచుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. మార్చి నెలలో రష్యాలో గోల్డ్ ట్రేడింగ్ ఏకంగా 350% పెరిగి 42.6 టన్నులకు చేరింది. 2024లో రష్యా ప్రజలు రికార్డు స్థాయిలో 75.6 టన్నుల బంగారాన్ని కొన్నారు. వీటితో పాటు రష్యా తన బంగారాన్ని చైనాకు కూడా భారీగా ఎగుమతి చేస్తోంది. 2025 మొదటి ఆరు నెలల్లో చైనాకు రష్యా చేసిన పసిడి ఎగుమతులు రెట్టింపు అయ్యాయి.
నిపుణులు ఏమంటున్నారు?
రష్యా కేవలం ఇప్పుడు మాత్రమే బంగారం అమ్ముతోందని, గతంలో 2002 నుంచి 2025 మధ్య దాదాపు 1,900 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఇది ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని వారి అభిప్రాయం. అయితే యుద్ధం మరిన్ని ఏళ్లు కొనసాగితే మాత్రం రష్యా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి, పసిడి నిల్వలు అడుగంటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.