NDA Meeting: నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ..
ప్రసంగించనున్న ప్రధాని మోడీ;
ఢిల్లీలో నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరై ప్రసంగించనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి సభ సజావుగా సాగడం లేదు. బీహార్‌లో ఎన్నికల సంఘం కేంద్రానికి అనుకూలంగా పని చేస్తుందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్డీఏ సభ్యుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించడం, పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్‌లపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోడీ ఈ అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఆగస్టు 5న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరిగే సమావేశానికి అధికార కూటమి ఎంపీలంతా హాజరుకానున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ మెజారిటీని కోల్పోయింది. మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వం నడుస్తోంది. మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ, ఎల్జీపీ సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. ఇక ఎన్డీఏ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరగడం తప్ప ఇంకేమీ జరగలేదు. బీహార్‌లో చేపట్టిన ఓటర్ సవరణ అంశంపైనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టి విజయం సాధించినందుకు గాను మోడీని పార్లమెంటరీ పార్టీ ఘనంగా సత్కరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆగస్టు 7 నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఈనెల 21లోపు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం. అదే రోజుతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ముగుస్తున్నాయి.
ఇక ఉపరాష్ట్రపతి పదవిని ఎన్డీఏ కూటమి గెలుచుకోనుంది. పూర్తి మెజార్టీ ఉన్నందున సొంతం చేసుకోనుంది. ఇక ప్రతిపక్ష కూటమి కూడా అభ్యర్థిని నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఇరు పక్షాల కూటమి నేతలు ఇప్పటికే ఈ ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభించాయి.