Student Arrest: యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థినికి బేడీలు వేసి తీసుకెళ్లిన అధికారులు
వివరాలు తెలియవంటున్న వర్సిటీ అధికారులు;
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా వలసలను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశాలకు చెందిన వారిని, వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిని అదుపులోకి తీసుకుని స్వదేశాలను తరలిస్తున్నారు. తాజాగా మాసాచుసెట్స్‌లో అంతర్జాతీయ విద్యార్థినిని ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
టఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విదేశీ విద్యార్థిని ఫెడరల్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధులు మూడు కార్లలో విద్యార్థిని ఉంటున్న ఆఫ్ క్యాంపస్‌లోని అపార్ట్ మెంట్ వద్దకు వచ్చారు. అక్కడ సదరు విద్యార్థినిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. చేతులు వెనక్కి విరిచి బేడీలు తగిలించారు. అనంతరం కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయినట్లు వర్సిటీ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. కాగా, సదరు విద్యార్థి వీసాను రద్దు చేసినట్లు తెలిసింది. విద్యార్థినిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.