Muhammad Yunus: బంగ్లాదేశ్ పాలనా బాధ్యతలు చేపట్టిన నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్

ప్రజలకు భద్రత కల్పించే పాలన అందిస్తామని వెల్లడి;

Update: 2024-08-09 02:30 GMT

గత కొన్ని వారాలుగా నిరసన జ్వాలలతో అట్టుడికిన బంగ్లాదేశ్ లో తాజాగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. విద్యార్థి సంఘాల కోరిక మేరకు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా మహ్మద్ యూనస్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రజలకు భద్రత కల్పించే పాలన అందిస్తామని తెలిపారు.

విద్యార్థుల పోరాటంతో బంగ్లాదేశ్ కు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. వచ్చిన స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని యూనస్ స్పష్టం చేశారు. దేశ పునర్ నిర్మాణంలో విద్యార్థులు అండగా ఉండాలని, బంగ్లాదేశ్ లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

"బంగ్లాదేశ్ లో మొదట శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలి... అందుకోసం ప్రజలంతా కృషి చేయాలి... దేశంలో ఎక్కడా ఎవరిపైనా దాడులు జరగకుండా చూడాలి. దయచేసి ఎక్కువ మంది శత్రువులను సృష్టించవద్దు" అని యూనస్ పేర్కొన్నారు.

యూనస్(84) మైక్రోక్రెడిట్ మరియు మైక్రోఫైనాన్స్‌కు మార్గదర్శకత్వం వహించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. గ్రామీణ బ్యాంక్ ద్వారా అమలులోకి తెచ్చాడు. పారిస్ నుంచి ఢాకాకు తిరిగి వచ్చిన కొన్ని గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి షహబుద్దీన్‌ తన అధికారిక నివాసం బంగాబబన్‌లో ప్రమాణం చేయించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. యూనస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో త్వరగా సాధారణ స్థితికి రావాలని భారతదేశం ఆశిస్తోందన్నారు. హిందువులు మరియు ఇతర మైనారిటీల భద్రతను కూడా కాపాడాలని కోరారు.

Tags:    

Similar News