మయన్మార్ భూకంప మృతుల సంఖ్య 3 వేల మార్కు దాటింది. గత శుక్రవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు, వంతెనలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటకొస్తున్నాయి. ఇప్పటి వరకూ 3,085 మంది మరణిం చినట్లు మయన్మార్ సైన్యం గురువారం ప్రకటించింది. దాదాపు 4,715 మంది గాయపడినట్లు పేర్కొంది. మరో 341 మంది గల్లంతైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. 17 దేశాల నుంచి వచ్చిన సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ విపత్తులో అండగా నిలబడి అవసరమై నసాయాన్ని అందిస్తున్న దేశాలకు ఈ సందర్భంగా సైన్యం కృతజ్ఞతలు తెలిపింది.