PAKISTAN: మా సోదరుడే ప్రధాని...
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు... వచ్చే ఎన్నికల్లో గెలిస్తే నవాజ్ షరీఫ్ ప్రధాని అవుతారని స్పష్టీకరణ;
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif ) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే తన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif ) మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తాడని స్పష్టం చేశారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న నవాజ్ షరీఫ్ త్వరలో పాక్ గడ్డపై కాలు మోపుతున్నారని తెలిపారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో (Pakistan) మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్(PML-N) పార్టీ విజయం సాధిస్తే అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని అవుతారని ప్రస్తుత పాక్ పీఎం షెహ్‌బాజ్ షరీఫ్ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్(former prime minister ).. మరికొన్ని వారాల్లోనే( next few weeks) స్వదేశానికి రానున్నారని చెప్పారు. పాకిస్థాన్ చేరుకున్న తర్వాత ఆయనపై నమోదైన అభియోగాలను ఎదుర్కొంటారని( Nawaz Sharif will face the law) అన్నారు. అనారోగ్య కారణాలతోనే ఆయన విదేశాలకు వెళ్లారని.. ఇందుకు గతంలో ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.
మూడుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ పలు అవినీతి కేసుల్లో 2018లో జైలుకు వెళ్లాడు. శిక్ష అనుభవిస్తుండగా ఆయన అనారోగ్యానికి గురికాగా.. విదేశాల్లో చికిత్స కోసం లాహోర్ హైకోర్టు నెల రోజులపాటు అనుమతి ఇచ్చింది. దీంతో 2019 నవంబరులో లండన్ వెళ్లిన షరీఫ్, ఇప్పటి వరకూ తిరిగి రాలేదు. న్యాయస్థానం పలుమార్లు ఆదేశించినా హాజరు కాకపోవడంతో కేసుల విచారణను లాహోర్ హైకోర్టు నిలిపివేసింది.
పాకిస్థాన్‌కు తిరిగివస్తే అరెస్టుచేసే అవకాశం ఉన్నందున నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల తన పార్టీ సారధ్యంలోని కూటమి అధికారంలోకి రావడం, తన సోదరుడు షెహబాజ్ ప్రధాని పగ్గాలు చేపట్టడంతో.. త్వరలోనే స్వదేశానికి తిరిగి వచ్చేందుకు నవాజ్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త పాస్‌పోర్టునూ జారీ చేసింది.
అక్రమాస్తుల కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మే నెలలో జరిగిన అల్లర్లపైనా షెహబాజ్ షరీఫ్ స్పందించారు. సైనిక నాయకత్వాన్ని పడగొట్టడం, పౌర వ్యవస్థను ప్రారంభించడం లక్ష్యంగా జరిగిన అల్లర్లకు ఇమ్రాన్ ఖాన్ ప్రధాన సూత్రధారని ఆరోపించారు. దేశంలో యుద్ధాన్ని ఉసిగొల్పారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ పిలుపు పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలను ప్రేరేపించిందని పాక్ పీఎం స్పష్టం చేశారు. దేశంలో అరాచకం, అంతర్యుద్ధం జరగాలని ప్రణాళికదారులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.