Nepal Gen Z Protests: నేపాల్‌లో మళ్లీ చెలరేగిన జెన్- Z ఆందోళనలు
కర్ఫ్యూ విధించిన అధికారులు
రెండు నెలల క్రితం జరిగిన జెన్-జెడ్ నిరసనలతో నేపాల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా మళ్లీ నేపాల్ యువతలో ఆగ్రహం చెలరేగింది. బారా జిల్లాలోని సిమ్రా ప్రాంతంలో పరిస్థితి మరోసారి దిగజారింది. బుధవారం జెన్-జెడ్ యువత, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఉద్రిక్తత తర్వాత గురువారం జెన్-జెడ్ యువత మళ్లీ నేపాల్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి జిల్లా యంత్రాంగం మధ్యాహ్నం 12:45 నుంచి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని ఆదేశించింది. సీపీఎన్-యూఎంఎల్ పార్టీ అనేది నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్టీ.
గురువారం ఉదయం 11 గంటలకు సిమ్రా చౌక్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. జనసమూహం పెరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. తరువాత మరింత అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తతలను దారి తీయడంతో వెంటనే పరిస్థితిని అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించారు. ఈ సందర్భంగా పలువురు జెన్-జెడ్ యువత మాట్లాడుతూ.. బుధవారం జరిగిన ఘర్షణకు సంబంధించి తాము ఫిర్యాదు చేసిన యుఎంఎల్ కార్మికులందరినీ పోలీసులు అరెస్టు చేయలేదని తెలిపారు.
బుధవారం నాడు Gen-Z యువత, UML కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. UML పార్టీ యువత మేల్కొలుపు ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. UML ప్రధాన కార్యదర్శి శంకర్ పోఖారెల్, పొలిట్‌బ్యూరో సభ్యుడు మహేష్ బాస్నెట్ బుధవారం ఉదయం 10:30 గంటలకు ఖాట్మండు నుంచి సిమ్రాకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ఈ వార్త అందిన వెంటనే Gen-Z యువత సిమ్రా విమానాశ్రయాన్ని చుట్టుముట్టింది. దీంతో UML కార్మికులతో వాళ్లకు ఘర్షణలు చెలరేగాయి.
గురువారం Gen-Z యువత నిరసనలు చేపట్టి మాట్లాడిన తర్వాత, పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో జిత్పుర్సిమ్రా సబ్-మెట్రోపోలిస్ 2వ వార్డు ఛైర్మన్ ధన్ బహదూర్ శ్రేష్ఠ, 6వ వార్డు ఛైర్మన్ కైముద్దీన్ అన్సారీ ఉన్నారు. బుధవారం జరిగిన ఘర్షణలో ఆరుగురు జెన్-జెడ్ మద్దతుదారులు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత జెన్-జెడ్ గ్రూప్ ఆరుగురు యుఎంఎల్ కార్మికులపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు వారిలో కొంతమంది నిందితులను అరెస్టు చేయకపోవడంతో తాము మళ్ళీ నిరసన తెలిపామని జెన్-జెడ్ జిల్లా సమన్వయకర్త సామ్రాట్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. నిరసనల నేపథ్యంలో సిమ్రా విమానాశ్రయం విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. బారా జిల్లాలోని ప్రధాన కూడళ్లు, సున్నితమైన ప్రాంతాలలో భద్రతా దళాలను మోహరించారు. జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు, అప్పుడప్పుడు ఘర్షణలు పెరుగుతూనే ఉండటంతో, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.