North Korea : ‘స్పై’ రాకెట్ విఫలం.. మళ్ళీ ట్రై చేద్దాం
సాధించేవరకు ప్రయోగాలు ఆపేదేలేదన్న ఉత్తర కొరియా;
అమెరికా, దక్షిణ కొరియాలపై నిఘా మాత్రమే లక్ష్యంగా ఉత్తర కొరియా గత కొద్దిరోజులుగా గూఢాచార ఉపగ్రహ ప్రయోగాలు తెగ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక సారి ఈస్పై శాటిలైట్‌ను ప్రయోగించిన కిమ్ మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఇక తాజాగా ఇవాళ మరోసారి ప్రయోగించిన రెండో స్పై శాటిలైట్ కూడా విఫలమైందని ఉత్తర కొరియా తెలిపింది. మూడు దశల రాకెట్లో తలెత్తిన లోపం కారణంగా ఈ ప్రయోగం ఫెయిల్ అయినట్లు వెల్లడించింది.
ఈ ప్రయోగంలో జరిగిన వైఫల్యాలను అధ్యయనం చేసిన తర్వాత.. అక్టోబర్‌లో ముచ్చటగా మూడోసారి ప్రయత్నించనున్నట్లు ఉత్తర కొరియా నేషనల్ ఏరోస్పేస్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. స్పై శాటిలైట్ ‘మల్లిగ్యోంగ్-1’ను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కొత్త తరహా రాకెట్ ‘చోల్లిమా-1’ను ఉపయోగించినట్లు ఉత్తర కొరియా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. మొదటి రెండు దశలు సాధారణంగానే సాగినా.. మూడో దశలో రాకెట్ ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా ప్రయోగం చివరికి విఫలమైందని వివరించింది.
మరోవైపు ఉత్తర కొరియా ప్రయోగం కారణంగా జపాన్ 'జే-అలర్ట్' జారీ చేసింది. ఆ స్పై రాకెట్.. జపాన్ దక్షిణ ప్రాంతంలోని ఒకినావా దీవుల మీదుగా వెళ్లడం వల్ల.. అక్కడి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. అయితే 20 నిమిషాల తరువాత క్షిపణి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిందని నోటీసులు జారీ చేసి అత్యవసర హెచ్చరికను ఎత్తివేసింది. అయితే ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉత్తర కొరియా చేపట్టిన ఈ ప్రయోగం ముప్పు అని జపాన్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అంతకుముందు ఉత్తర కొరియా వాయువ్య టోంగ్‌చాంగ్-రి ప్రాంతంలో ఉన్న ప్రధాన అంతరిక్ష కేంద్ర నుంచి ఓ రాకెట్ప్రయోగించగా అది కొరియన్ ద్వీపకల్పం పశ్చిమ తీరంలో అంతర్జాతీయ జలాల మీదుగా వెళ్లిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బాలిస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ప్రయోగాలు చేయొద్దన్న ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఈ ప్రయోగం ఉల్లంఘించిందని దక్షిణ కొరియా పేర్కొంది. మే చివరలో తన మొదటి గూఢచార ఉపగ్రాహాన్ని ప్రయోగించింది ఉత్తర కొరియా. అయితే, దాన్ని మోసుకెళ్లిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే సముద్రంలో కుప్పకూలింది. దీంతో మరోసారి ప్రయోగం చేస్తామని అప్పుడే కిమ్ సర్కార్ ప్రతిజ్ఞ చేసింది.