Pakistani: ఉగ్రవాదులుగా పాక్ మాజీ సైనికులు

నార్తర్న్‌ కమాండింగ్‌ చీఫ్‌ జనల్‌ ఉపేంద్ర ద్వివేది;

Update: 2023-11-25 05:00 GMT

ఇంతకాలం ఉగ్రతండాలకు తమ భూభాగంలో ఆశ్రయం ఇచ్చిన పాకిస్థాన్‌  ఇప్పుడు ఏకంగా ఉగ్ర కార్యకలాపాల కోసం మాజీ సైనికులను వాడుకుంటోంది. పాక్‌ ఆర్మీ ప్రత్యేక దళంలో పనిచేసిన కొందరు మాజీ సైనికులు కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సైన్యం గుర్తించింది. సైనిక ఆపరేషన్లు పెరగటంతో పాటు రిక్రూట్‌మెంట్లు నిలిచిపోవటంతో భారత్‌లోకి విదేశీ ఉగ్రవాదులను పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సైనికాధికారులు చెబుతున్నారు.

భారత భూభాగంలోకి ఉగ్రవాదాన్ని ఎగదోసి, అస్థిరత సృష్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. స్థానికంగా రిక్రూట్‌మెంట్లు నిలిచిపోవటంతో....ఎటూ పాలుపోలేనిస్థితిలో పాకిస్థాన్‌ తమ ఆర్మీలో పనిచేసిన మాజీ సైనికులతో ఉగ్రవాద కార్యకలాపాలు నెరిపేందుకు తెరతీసినట్లు తేలింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన సైనికుల పార్థివదేహాలకు ఉత్తర కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన....కీలక విషయాలు వెల్లడించారు. పాక్‌ ఆర్మీ ప్రత్యేకదళంలో పనిచేసిన కొందరు మాజీ సైనికులు కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పారు. పెద్దఎత్తున సైనిక ఆపరేషన్లు, ఉగ్రసంస్థల్లో చేరేందుకు స్థానిక యువత విముఖత చూపటం వంటి కారణాల వల్ల కశ్మీర్‌లో ఉగ్రకార్యకలాపాల కోసం పాకిస్థాన్‌ తమ మాజీ సైనికులను పురమాయిస్తున్నట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. 


రాజౌరీలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్‌ ఖౌరీ, అతని అనుచరుడు హతం కావటం పాకిస్థాన్‌కు శరాఘాతమని సైన్యం భావిస్తోంది. దాయాది దేశం ఉగ్రకుట్ర ప్రణాళికలకు కోలుకోలేని దెబ్బగా ఉత్తర కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ పేర్కొన్నారు. రాజౌరీఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు ఏడాదికాలంగా దారుణహత్యలకు పాల్పడినట్లు తెలిపారు. ఉగ్రసంస్థల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సమాచారం అందటం వల్ల వారిని పట్టుకోలేకపోయినట్లు చెప్పారు. ఈ ఏడాది జరిగిన 9మంది పౌరులు, ఐదుగురు సైనికుల హత్యలతో ఆ ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు ద్వివేదీ తెలిపారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యం ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని సైనికాధికారులు అనుమానిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌ సరిహద్దు ప్రాంతమైన రాజౌరీ-పూంచ్‌ బెల్ట్‌లో 20నుంచి 25మంది విదేశీ ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా వేశారు. కశ్మీర్‌లోని స్థానికులసాయంతో భద్రతాదళాలు, నిఘావర్గాలు ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లను ఉద్ధృతంగా నిర్వహిస్తున్నట్లు ఉత్తర కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈ ఆపరేషన్‌ అదేవిధంగా కొనసాగితే ఏడాదిలోపు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News