Pakistan: తగ్గేదే లేదన్న పాకిస్థాన్, ఇరాన్‌పై ప్రతీకార దాడులు
24 గంటల్లోనే పాక్ ఎయిర్ స్ట్రైక్.. ఏడుగురు మృతి;
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని పాక్ తీవ్రంగా ఖండించింది. తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరికలు చేసింది. ఇక ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంది. సరిగ్గా 24 గంటలలోపే ఇరాన్‌పై ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ భూభాగంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గల సరవన్ నగరానికి సమీపంలో ఉన్న ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్’, ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ స్థావరాలపై పాక్ గురువారం వైమానిక దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ భూభాగంలో ఉన్న బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలకు చెందిన స్థావరాలపై గురువారం పాక్ వైమానిక దాడులు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
పాకిస్థాన్‌లోని జైష్-అల్-అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి దాడికి దిగింది. అయితే ఇరాన్ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని, మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. ఇది పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.
అయితే తమ భూభాగంపై ఇరాన్ చేసిన దాడిని తీవ్రంగా పరిగణించిన పాక్.ఇప్పటికే ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసి, తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇరాన్‌లో ఉన్న పాకిస్థాన్ రాయబారిని కూడా వెనక్కి రప్పించింది. ఈ క్రమంలో భవిష్యత్‌లో పాక్, ఇరాన్ మధ్య జరిగే అన్ని ద్వైపాక్షిక పర్యటనలను ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను తెలియజేస్తుంది.
అయితే పాక్‌లోని ఉగ్రమూక స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులు చేయడాన్ని భారత్ పరోక్షంగా సమర్థిస్తూ స్పందించింది. అయితే ఇది పూర్తిగా ఇరాన్, పాక్ అంతర్గత వ్యవహారమని పేర్కొన్న భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైస్వాల్.. ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఈ సందర్భంగా భారత్ తేల్చి చెప్పింది.