Pakistan: పాకిస్తాన్ లో పోలీసు వ్యాన్ పై ఆత్మాహుతి దాడి..
ఇద్దరు మృతి, అనేక మందికి గాయాలు!;
భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ దాడి నుంచి తేరుకోక ముందే పాక్ లో పోలీస్ వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెషావర్‌లోని చమ్కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్‌లోని పశువుల మార్కెట్ సమీపంలో పోలీసు మొబైల్ వ్యాన్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని ఎస్‌ఎస్‌పి మసూద్ బంగాష్ తెలిపారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ ఈ దాడిని ఖండించారు. సంఘటనపై వివరణాత్మక నివేదికను కోరారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా భారత్ ఏప్రిల్ 7న పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి వైమానిక దాడులు చేయడంతో దాయాది దేశానికి పెద్ద దెబ్బ తగిలింది.
భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్‌లోని దాదాపు 11 వైమానిక స్థావరాలపై భారతదేశం విజయవంతంగా దాడి చేసింది. దీని తరువాత, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత DGMO కి ఫోన్ చేశారు. పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించింది. దీని తరువాత, కొన్ని షరతులతో పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను భారతదేశం అంగీకరించింది.