Pakistan: సహాయంలోనూ నీచంగా ప్రవర్తించిన పాక్

ఎక్స్‌పైరీ అయిన ఆహారాన్ని శ్రీలంకకు పంపిన పాకిస్థాన్!

Update: 2025-12-03 00:15 GMT

దిత్వా తుపాను సహాయార్థం శ్రీలంకకు పాకిస్థాన్ పంపిన అత్యవసర సహాయంలో గడువు తీరిన వైద్య సామగ్రి, వినియోగానికి పనికిరాని ఆహార పొట్లాలు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. తుపానుతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్‌తో పాటు పలు దేశాలు సహాయం అందించాయి. పాకిస్థాన్ కూడా సహాయం పేరుతో పంపిన వస్తువులు ఎక్స్‌పైర్డ్ అయ్యాయని శ్రీలంక అధికారులు చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పాకిస్థాన్ పంపిన వైద్య సామగ్రి, ఆహార పొట్లాలు, ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన మానవతా సహాయంలో గడువు తేదీ ముగిసిన వస్తువులు ఉన్నట్లు గుర్తించడం పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై శ్రీలంక అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

పాకిస్థాన్ పంపిన సామాగ్రి కొలంబో చేరుకున్న విషయాన్ని తెలియజేస్తూ, శ్రీలంకకు పాకిస్థాన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముద్రించిన ప్యాకెట్లను శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్ సామాజిక మాధ్యమల్లో పోస్టు చేసింది. అయితే, ఈ ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబర్‌తో ముగిసిపోయింది. ఇది గమనించిన శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరోవైపు, భారత్ శ్రీలంకకు ఆపన్నహస్తాన్ని అందించింది. భారత్ ద్వీపదేశంలో భారీ మానవతా కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ సాగర్ బంధు కింద నవంబర్ 28 నుంచి భారత్ వాయు, సముద్ర మార్గాల ద్వారా 53 టన్నుల సహాయ సామాగ్రిని పంపించింది. శ్రీలంకలో చిక్కుకున్న 2000 మంది భారతీయుల్ని కూడా స్వదేశానికి తీసుకువచ్చింది. భారత్ సొంత దేశ ప్రజల్నే కాకుండా జర్మనీ, స్లోవేనియా, యూకే, దక్షిణాఫ్రికా, పోలాండ్, బెలారస్, ఇరాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరుల్ని కూడా రక్షించింది.

Tags:    

Similar News