Pakistan: జపాన్ కు పాక్ నకిలీ జట్టు.. ఆడేందుకు కాదు..చొరబడేందుకే ..
నకిలీ పత్రాలతో ప్రయాణిస్తున్న 22 మందిని అరెస్ట్ చేసిన అధికారులు
ఫుట్‌బాల్ క్రీడాకారుల రూపంలో పాక్ పౌరులను అక్రమంగా జపాన్‌కు తరలిస్తున్న భారీ ముఠా గుట్టును పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) రట్టు చేసింది. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారులమని చెప్పుకుంటూ జపాన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 22 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. జపాన్ ఇమ్మిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
ఎఫ్ఐఏ వర్గాల కథనం ప్రకారం, నిందితులంతా పూర్తి ఫుట్‌బాల్ కిట్‌లు ధరించి, పాకిస్థాన్ ఫుట్‌బాల్ సమాఖ్య (పీఎఫ్ఎఫ్)తో తమకు సంబంధాలున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, పాక్ విదేశాంగ శాఖ జారీ చేసినట్లుగా నకిలీ నిరభ్యంతర పత్రాలను (ఎన్ఓసీ) కూడా తమ వెంట తీసుకెళ్లారు.
అయితే, జపాన్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు వీరి ప్రవర్తనపై అనుమానం కలిగింది. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మోసం బయటపడింది. దీంతో అధికారులు వారందరినీ వెంటనే తిరిగి పాకిస్థాన్‌కు పంపించారు. అసలు పాకిస్థాన్ విమానాశ్రయాల నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండా వీరు విమానం ఎలా ఎక్కారనే దానిపై స్పష్టత రాలేదని స్థానిక మీడియా సంస్థ జియో న్యూస్ నివేదించింది.
ఈ రాకెట్ వెనుక సియాల్‌కోట్‌లోని పస్రూర్‌కు చెందిన మాలిక్ వకాస్ సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. ఇతను 'గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్' పేరుతో ఒక నకిలీ ఫుట్‌బాల్ క్లబ్‌ను సృష్టించి, జపాన్‌కు పంపిస్తానని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు వసూలు చేశాడు. సెప్టెంబర్ 15న గుజ్రాన్‌వాలాలో ఎఫ్ఐఏ అధికారులు వకాస్‌ను అరెస్ట్ చేసి, అతనిపై పలు కేసులు నమోదు చేశారు.
ఇదే పద్ధతిలో వకాస్ గతంలోనూ మనుషులను అక్రమంగా తరలించినట్లు దర్యాప్తులో తేలింది. 2024 జనవరిలో 'బోవిస్టా ఎఫ్‌సీ' అనే జపాన్ క్లబ్ నుంచి నకిలీ ఆహ్వాన పత్రాలు సృష్టించి 17 మందిని జపాన్‌కు పంపించాడు. అయితే, అలా వెళ్లిన వారు ఇప్పటివరకు తిరిగి రాలేదని అధికారులు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.