Pope Francis Funeral : పోప్ అంత్యక్రియలు 26న
చర్చిల్లో గంటలు.. పతాకాల అవనతం;
క్యాథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఈ నెల 26న జరగనున్నాయి. ఆయన అస్తమయం నేపథ్యంలో మతాధికారులు మంగళవారం సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సెయింట్ పీటర్స్ బసీలికాకు భౌతిక కాయాన్ని తీసుకువచ్చాక చివరిసారిగా నివాళులర్పించేందుకు ప్రజలకు బుధవారం నుంచి అవకాశం కల్పించాలని, శనివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
పోప్ ఫ్రాన్సిస్ అస్తమయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో గంటలు మోగించారు. భారత్, ఇటలీ, తైవాన్, అమెరికాల్లో సంతాప దినాలు పాటిస్తూ జాతీయ పతాకాలను అవనతం చేశారు. ఇటలీ, అర్జెంటీనాల్లో జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లను రద్దుచేశారు. ఆస్ట్రేలియాలో ప్రధాని ఆంథోనీ అల్బనీస్, ఆయన ప్రత్యర్థి కూడా ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరికొందరు నేతలు సంతాప సందేశాలు వెలువరించారు. ఫ్రాన్సిస్ కన్నుమూతపై చైనా కూడా సంతాపం తెలిపింది. చర్చిల నిర్వహణపై విభేదాల నేపథ్యంలో తొలిరోజు డ్రాగన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
కొత్త పోప్ ఎన్నికలో దళిత హైదరాబాద్ కార్డినల్
నూతన పోప్‌ను ఎన్నుకునేందుకు రహస్య ఓటింగులో పాల్గొనేవారిలో నలుగురు భారతీయులు సైతం ఉన్నారు. ఈ నలుగురిలో హైదరాబాద్‌కు చెందిన దళిత కార్డినల్ పూల ఆంథోనీ ఒకరు. ఆయన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు. మన దేశంలో కార్డినల్ హోదా పొందిన తొలి దళితుడుగా రికార్డు సాధించారు.
పేరు మార్పు.. వెయ్యేళ్ల ఆచారం
పోప్ పదవికి ఎంపికైనవారు పదవిలోకి రాగానే చర్చికి సేవచేయడంలో కొత్తదశకు చేరినట్లుగా భావిస్తారు. వ్యక్తిగత, జాతీయత గుర్తింపుల నుంచి దూరం కావడానికి కొత్తపేరు పెట్టుకుంటారు. బైబిల్‌లో పేర్కొన్న పేర్ల నుంచి ఒకటి ఎంచుకొని స్వీకరిస్తారు. దాదాపు వెయ్యేళ్ల నుంచి ఈ ఆచారం ఉంది. పదవిలోకి వచ్చాక వారు ప్రైవేటు వ్యక్తులు ఏమాత్రం కారు. ప్రపంచ క్యాథలిక్కు చర్చికి నాయకుడిగా ఉంటారు