Indian Student: అమెరికా విమానంలో భారత విద్యార్థి వీరంగం

ఇద్దరు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడి

Update: 2025-10-29 01:30 GMT

అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి విమానంలో వీరంగం సృష్టించాడు. వీసా స్టేటస్ కోల్పోయాడన్న కారణంతో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా బోస్టన్‌కు మళ్లించి, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి (28) అనే భారత విద్యార్థి విమానంలో భోజనం సరఫరా చేసిన తర్వాత ఒక్కసారిగా హింసాత్మకంగా ప్రవర్తించాడు. తన చేతిలో ఉన్న మెటల్ ఫోర్క్‌తో 17 ఏళ్ల బాలుడి భుజంపై, మరో 17 ఏళ్ల బాలుడి తల వెనుక భాగంలో పొడిచాడు. అంతేకాకుండా ఓ మహిళను చెంపదెబ్బ కొట్టి, విమాన సిబ్బందిపై కూడా దాడికి యత్నించినట్లు బోస్టన్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్ లియా ఫోలీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, ప్రణీత్ తన వేళ్లతో తుపాకీ ఆకారాన్ని చేసి, దాన్ని నోట్లో పెట్టుకుని కాల్చుకున్నట్లుగా అభినయించాడని ప్రాసిక్యూటర్ కార్యాలయం వివరించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే బోస్టన్‌లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ ఫెడరల్ అధికారులు ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చిన ప్రణీత్, ప్రస్తుతం చట్టబద్ధమైన వీసా స్టేటస్‌ను కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అతను బైబిల్ స్టడీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో చేరినట్లు తెలిసింది. అతని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను చికాగోలోని మూడీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా ఉన్నాడు. ప్రణీత్‌పై ప్రమాదకరమైన ఆయుధంతో విమానంలో దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు 2,50,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది.

Tags:    

Similar News