Venezuela violence : వెనిజులాలో కొనసాగుతున్న ఆందోళనలు
పోలీస్ కాల్పుల్లో 11 మంది మృతి;
వెనిజులా దేశాధ్యక్షుడిగా మళ్లీ నికోలస్ మడురో విజయం సాధించడంతో.. ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. ఈ ఘటనల్లో ఇప్పటిరకు 11 మంది ఆందోళనకారులు మరణించారు.
దేశ రాజధాని సెంట్రల్ కరాకాస్‌లో వేల మంది ప్రదర్శన చేపట్టారు. మురికి వాడల నుంచి, పర్వత ప్రాంతాల నుంచి కూడా జనం కొన్ని మైళ్ల దూరం జనం నడిచివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు. ఎన్నికల్లో గెలిచినట్లు మాడురో ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో మోసం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ప్రతిపక్ష నేత ఎడ్ముండో గొంజాలేజ్ 73.2 శాతం ఓట్లతో గెలుపొందినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మడురోను గద్దె దించేందుకు .. ఈసారి ప్రతిక్షాలు ఒక్కటయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు, ఎన్నికకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళనల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లకు చెందిన ఓటింగ్ రికార్డులను రిలీజ్ చేయాలని పశ్చిమ, లాటిన్ అమెరికా దేశాలు డిమాండ్ చేశాయి.
మాడురో ఎన్నికను అర్జెంటీనా కూడా వ్యతిరేకించింది. బ్యూనస్ ఎయిరిస్‌లో ఉన్న వెనిజులా దౌత్యవేత్తలను రీకాల్ చేసింది. చిలీ, కోస్టారికా, పనామా, పెరూ, డామినికన్ రిపబ్లిక్, ఉరుగ్వే దేశాల్లో ఉన్న వెనిజులా దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించారు. పనామా, డామినికన్ రిపబ్లిక్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలను కూడా వెనిజులా రద్దు చేసింది.