Putin: భారత్ అవమానాన్ని అంగీకరించదు.. ఒత్తిళ్లకు తలొగ్గదు.. ట్రంప్‌నకు పుతిన్‌ కౌంటర్‌

మోడీకి మద్దతు ప్రకటించిన పుతిన్,..

Update: 2025-10-03 03:00 GMT

భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి.

దక్షిణ రష్యాలోని సోచిలో నల్ల సముద్రం రిసార్ట్‌లో భారతదేశంతో సహా 140 దేశాల నుండి భద్రతా – భౌగోళిక రాజకీయ నిపుణుల అంతర్జాతీయ వాల్డాయ్ చర్చా వేదికలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే, అది ప్రపంచ ఇంధన ధరల్ని పెంచుతుందని, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను ఎక్కువగా పెంచాల్సి వస్తుందని అన్నారు. అది యూఎస్ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించారు.

డిసెంబర్ నెలలో పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారత్ దేశంతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చర్యలు రూపొందించాలని పుతిన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. భారత్ దేశంతో మాకు ఎప్పుడూ సమస్యలు లేదా అంతర్రాష్ట్ర ఉద్రిక్తతలు లేవు అని పుతిన్ అన్నారు. భారత్ రష్యా నుంచి ఇంధన కొనుగోలును నిలిపేస్తే అది 9-10 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని పుతిన్ అన్నారు. అమెరికా విధించిన శిక్షాత్మక సుంకాల కారణంగా భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ద్వారా సమతుల్యం చేస్తామని ఆయన చెప్పారు. వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి, రష్యా భారతదేశం నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు మరియు మందులను కొనుగోలు చేయవచ్చని ఆయన అన్నారు. అమెరికాకు రష్యా అణు ఇంధనాన్ని సరఫరా చేస్తోందని, భారత్ తమ నుంచి ఆయిల్ కొంటే తప్పేంటని పుతిన్ యూఎస్ ద్వంద్వ నీతిని ఎత్తిచూపారు.

Tags:    

Similar News