Putin: రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టిన పుతిన్
మరో ఆరేండ్లపాటు పదవిలో;
రష్యా అధ్యక్షుడిగా వరుసగా ఐదోసారి వ్లాదిమర్ పుతిన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. జాతీయ పార్లమెంట్‌కు చెందిన చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు పొంది వరుసగా ఐదోసారి పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
పుతిన్ 2030 వరకు అధ్యక్షుడిగా కొనసాగితే 30 ఏళ్ల పాటు రష్యాను పాలించిన నాయకుడిగా రికార్డును సృష్టించనున్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు పెద్దగా పోటీనిచ్చే విపక్ష నేత లేకపోవడంతో మరోసారి ఘన విజయం సాధించారు. 2030తో పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన తదుపరి ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హుడే. గతంలో జోసఫ్ స్టాలిన్ 29 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగారు. కమ్యూనిజం విప్లవం రాకముందు రాణి కేథరిన్ ది గ్రేట్ 34 ఏళ్ల పాటు రష్యాను పాలించారు. 2018లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాను టాప్-5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చేస్తానని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్‌తో పోరు, పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలతో మాస్కో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో రానున్న ఆరేళ్లల్లో పుతిన్ ఏమి చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ప్రపంచ దేశాలలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రష్యాను తీర్చిదిద్దుతానని 2018లో అధికారం చేపట్టినప్పుడు పేర్కొన్న పుతిన్ దానిని నిలుపుకోలేక పోయారు. రెండేండ్ల క్రితం ఉక్రెయిన్‌తో యుద్ధంతో నిధులు ఎక్కువ మొత్తం యుద్ధంపైనే వెచ్చించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.
మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. అప్పట్లో అతని ప్రధాన ప్రత్యర్థి అయిన అలెక్సీ నావల్నీ ఎన్నికలకు నెలకు ముందు హఠాత్తుగా మరణించారు. మరికొంతమందిని జైలుకు పంపగా, మరికొందరిని బలవంతంగా విదేశాలకు పంపారన్న ఆరోపణలున్నాయి. రష్యా ప్రైవేట్ సైన్యం అధినేత ప్రిగోజిన్.. పుతిన్‌పై తిరుగుబాటు చేయడం, విమాన ప్రమాదంలో అతను అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పుతిన్‌పై పలు విమర్శలొచ్చాయి.
ప్రచ్ఛన్నయుద్ధం ముగిసే సమయంలో జర్మనీలో సోవియట్ యూనియన్ గూఢచారిగా ఉన్న పుతిన్, దేశాధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన వ్యక్తిగా నిలవనున్నారు. పుతిన్ మరో ఆరేళ్లపాటు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యుద్ధానికి నిధులు సమకూర్చడానికి పన్నులను పెంచడం, సైన్యంలో చేరడానికి మరింత మందిని ఒత్తిడి చేయడం వంటి నిర్ణయాలను తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.