Russia oil: భారత్‌కు రష్యా బంపరాఫర్‌,, భారీ డిస్కౌంట్‌తో చమురు

గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తగ్గింపుకు చమురు

Update: 2025-11-25 04:00 GMT

రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత్ కు భారీ డిస్కౌంట్‌తో ఆయిల్ విక్రయించేందుకు రష్యా సిద్ధమైంది. రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకోయిల్‌లపై అమెరికా విధించిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా రష్యా నుంచి భారత్‌కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి.

అమెరికా ఆంక్షలు రష్యా చమురు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో రష్యా ప్రధాన చమురు ఉరల్స్‌ను డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు కంటే బ్యారెల్‌కు ఏడు డాలర్ల వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించేందుకు రష్యా సిద్ధమైంది. ఆంక్షలు లేనప్పుడు ఈ తగ్గింపు మూడు డాలర్లుగా ఉండగా, ఇప్పుడు రెండింతలు అయింది. తాజా తగ్గింపు ధరతో వచ్చే చమురు డిసెంబర్ నెలలో లోడ్ అయి జనవరిలో భారత్‌కు చేరే అవకాశం ఉంది.

మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి తక్కువ ధరల కారణంగా రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. నవంబర్ 21 నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడంతో భారతీయ రిఫైనరీలు రష్యా చమురు ఆర్డర్లను కొంతకాలం నిలిపివేశాయి. ఈ వారంలో ఉరల్స్ చమురు ధర భారీగా తగ్గడంతో భారత రిఫైనరీలు తిరిగి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపాయి. ఆంక్షలు లేని సంస్థల నుంచి చమురు కొనుగోలుకు సిద్ధమయ్యాయి.

Tags:    

Similar News