RUSSIA: మాస్కో ఎయిర్‌పోర్ట్‌పై దాడికి యత్నం
మాస్కోలోని రెండో అతిపెద్ద విమానాశ్రయంపై దాడికి ఉక్రెయిన్ యత్నం... భగ్నం చేసిన రష్యా దళాలు;
రష్యా(Russia) రాజధాని మాస్కో(moscow)కు సమీపంలోని రెండో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్(airport)లో విమానాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్ లక్ష్యంగా ఉక్రెయిన్( Ukraine) చేపట్టిన డ్రోన్ దాడి(drone attack)ని రష్యా బలగాలు భగ్నం చేశాయి. మాస్కోకు 15 కిలోమీటర్ల దూరంలోని నుకొవొ ఎయిర్‌పోర్ట్(Vnukovo airport ) టార్గెట్‌గా ఉక్రెయిన్ డ్రోన్ దాడికి(tried to attack ) యత్నించింది. మాస్కో శివార్లలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ డ్రోన్‌ను ధ్వంసం చేయడంతో ఎయిర్‌పోర్ట్‌కు పెనుముప్పు తప్పింది.
ఉక్రెయిన్ సేనలు ఇటీవల మాస్కోపై డ్రోన్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో పాక్షికంగా భవనాలు దెబ్బతిన్నాయి. మాస్కో వెలుపల రెండు డ్రోన్లను కూల్చివేసి, మూడోదాని సిగ్నల్‌ను స్తంభింపజేశామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలో రష్యన్ దాడుల్లో ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా అణిచివేత ధోరణిని ఈ యుద్ధ నేరాలు బహిర్గతం చేస్తున్నాయని ఆయన అన్నారు. మాస్కో ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి గురించి ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు.
మరోవైపు భీకరయుద్ధంతో విరుచుకుపడుతున్న రష్యా ఆనవాళ్లను ఉక్రెయిన్ తొలిగిస్తోంది. స్వదేశీ భావనను ప్రజల్లో మరింత రగిలించేలా సొంత చిహ్నాలను ఏర్పాటు చేస్తోంది. కీవ్‌లో సోవియట్ కాలం నాటి 335 అడుగుల ఎత్తైన మదర్‌ల్యాండ్ స్మారక చిహ్నంపై గతంలో ఉన్న సోవియట్ సుత్తి , కొడవలిని తొలగించారు. వాటి స్థానంలో ఉక్రెయిన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్‌గా పిలిచే -ట్రైజబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కీవ్‌లో 42 ఏళ్ల కింద ఏర్పాటుచేసిన మదర్‌ల్యాండ్ స్మారక చిహ్నంపై కొత్త గుర్తులు వచ్చి చేరనున్నాయి. ఈ పనులను ఉక్రెయిన్ జాతీయ దినోత్సవమైన ఆగస్టు 24లోపు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం చకచకా పనులు పూర్తి చేస్తున్నారు.
తమ ప్రధాన భూభాగంపై ఇటీవల ఉక్రెయిన్ వరుస దాడులు చేస్తుండడంతో రష్యా దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇటీవల నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌక సహా ఇంధన ట్యాంకర్‌ను డ్రోన్‌తో ఉక్రెయిన్‌పై పేల్చిసింది. దీనికి పుతిన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉక్రెయిన్‌పై వారం రోజుల నుంచి వరుసగా క్షిపణి దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. కీవ్, లివిన్ నగరాలకు మధ్యనున్న స్టారోకోస్తియాంటినివ్ పై మాస్కో దళాలు భారీ దాడులు చేశాయి. ఈ దాడిలో మొక్కజొన్న నిల్వ కేంద్రం వద్ద పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో చెలరేగిన మంటలను ఆపేందుకు ఉక్రెయిన్ అగ్నిమాపక శకటాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.