NORTH KOREA: కిమ్‌ రాజ్యంలో రష్యా మంత్రి పర్యటన

ఉత్తరకొరియాలో రష్యా రక్షణమంత్రి షోయిగు పర్యటన.. అధికారిక లాంఛనాలతో స్వాగతం... ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యం...

Update: 2023-07-26 06:30 GMT

వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికా సహా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఉత్తరకొరియా(North Korea)లో రష్యా రక్షణమంత్రి( Russian Defence Minister Sergey Shoigu ) పర్యటిస్తుండడం కలకలం రేపుతోంది. రష్యా రక్షణమంత్రి సెర్గి షోయిగు(Minister Shoigu ) సైనిక బృందంతో ఉత్తరకొరియా చేరుకోగా.. అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల షోయిగు బృందం కిమ్‌ రాజ్యంలో పర్యటిస్తుందని మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్యాంగాంగ్‌లోని సునన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రష్యా ప్రతినిధి బృందానికి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికినట్లు ఉత్తర కొరియా రక్షణ మంత్రి కాంగ్ సున్-నామ్ వెల్లడించారు.

కొరియా యుద్ధం ముగిసిన 70 ఏళ్లు అయిన సందర్భంగా జరిగే వార్షికోత్సవంలో రష్యా ప్రతినిధి బృందం పాల్గొననుంది. కొరియా ప్రజల విజయానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు రష్యా రక్షణ మంత్రి శుభాకంక్షలు ప్రకటిస్తారని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) తెలిపింది. ఈ పర్యటన రష్యా-ఉత్తర కొరియా సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, రెండు దేశాల మధ్య సహకార అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇరు దేశాల ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.


ఉత్తరకొరియాకు రష్యా-చైనా దీర్ఘ కాల మిత్రదేశాలు. 1950లో కొరియా ద్వీపకల్పంలోకి సైనికులను పంపడం ద్వారా చైనా ఉత్తర కొరియా ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమయ్యాయి. కొరియా యుద్ధంలో లక్షా 80 వేల మంది కంటే ఎక్కువ మంది చైనా సైనికులు మరణించారు. అమెరికా దూకుడును నిరోధించడానికి, ఉత్తరకొరియాకు చైనా, రష్యా సహాయం చేస్తున్నాయని పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నాయి.

యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ కూడా ఉత్తర కొరియాకు మద్దతు ఇచ్చింది. దశాబ్దాలుగా మాస్కో ఉత్తర కొరియాకు బలమైన మిత్రదేశంగా నిలిచింది. ఉత్తర కొరియా-దక్షిణ కొరియా, అమెరికా మిత్రదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా- రష్యా ప్రతినిధుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా, దక్షిణ కొరియా... కిమ్‌ రాజ్యంలో క్షిపణి ప్రయోగాలను ఇప్పటికే చాలాసార్లు తీవ్రంగా ఖండించాయి.

అమెరికా, దక్షిణకొరియా అణు సామర్థ్యం గల జలాంతర్గాములు, బాంబర్లను సముద్ర జలాల్లో కూడా మోహరించింది. మరోవైపు అమెరికా సైనికుడు ప్రైవేట్ ట్రావిస్ కింగ్ దక్షిణ కొరియా సరిహద్దు దాటి ఉత్తర కొరియాలోకి అక్రమంగా ప్రవేశించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 1982 తర్వాత ఉత్తర కొరియాలోకి ప్రవేశించిన మొదటి అమెరికా సైనికుడిగా ఇతడిని భావిస్తున్నారు. జూలై 17న, యునైటెడ్ నేషన్స్ కమాండ్ (UNC) డిప్యూటీ కమాండర్, జనరల్ ఆండ్రూ హారిసన్, ఉత్తర కొరియాతో కిమ్‌తో సంభాషణ ప్రారంభమైందని ప్రకటించారు.

Tags:    

Similar News