Russian Spirit : రష్యన్ కిక్కుకు ఫిదా అవుతున్న భారతీయులు..10 నెలల్లో 520 టన్నుల మద్యం స్వాహా
Russian Spirit : భారతదేశంలో విదేశీ మద్యం ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశీయులకు ఇప్పుడు రష్యన్ మద్యం రుచి బాగా నచ్చుతోంది. గత పది నెలల గణాంకాలను పరిశీలిస్తే రష్యా నుంచి వచ్చే వోడ్కా, విస్కీ, జిన్, లిక్కర్‌లకు భారత్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. కేవలం పది నెలల్లోనే మనోళ్లు ఏకంగా 520 టన్నుల రష్యన్ మద్యాన్ని తాగేశారంటే అతిశయోక్తి కాదు. గత ఏడాదితో పోలిస్తే ఈ దిగుమతులు ఏకంగా నాలుగు రెట్లు పెరగడం విశేషం.
రష్యన్ మీడియా, బీసీసీఐ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్రో ఎక్స్‌పోర్ట్ గణాంకాల ప్రకారం.. 2025 సంవత్సరం మొదటి పది నెలల్లో (జనవరి - అక్టోబర్) రష్యా నుంచి భారత్‌కు సుమారు 520 టన్నుల స్పిరిట్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు 9 లక్షల అమెరికన్ డాలర్లు (రూ. 7.5 కోట్లు పైమాటే). గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దిగుమతుల బరువు పరంగా మూడు రెట్లు, విలువ పరంగా నాలుగు రెట్లు వృద్ధి నమోదైంది. ఈ భారీ పెరుగుదలతో రష్యా ఎగుమతిదారులకు భారత్ ఒక లాభదాయకమైన మార్కెట్‌గా మారుతోంది.
వోడ్కానే నెంబర్ వన్
రష్యా నుంచి వచ్చే మద్యంలో భారతీయులు ఎక్కువగా వోడ్కాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం ఎగుమతుల్లో వోడ్కా వాటానే సింహభాగం (సుమారు 7.6 లక్షల డాలర్లు) ఉంది. రష్యాకు చెందిన ప్రముఖ బ్రాండ్లు అయిన బెలూగా, రష్యన్ స్టాండర్డ్ వంటివి భారతీయ బార్లలో, ప్రీమియం లౌంజ్‌లలో ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. కేవలం వోడ్కా మాత్రమే కాకుండా, రష్యన్ విస్కీ, జిన్ వంటి హార్డ్ డ్రింక్స్‌పై కూడా యువత ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రష్యన్ మద్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ప్రస్తుతం 14వ స్థానంలో ఉంది. రష్యాకు ప్రధానంగా కజకిస్థాన్, చైనా, బెలురూస్ వంటి పొరుగు దేశాలే పెద్ద కస్టమర్లు అయినప్పటికీ.. భారత్‌లో నమోదవుతున్న వృద్ధి రేటు మాత్రం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ప్రీమియం వోడ్కా సంస్కృతి పెరగడం, మారుతున్న జీవనశైలి, కొత్త కొత్త రకాల మద్యాన్ని రుచి చూడాలనే భారతీయుల తపన రష్యన్ కంపెనీలకు వరంగా మారింది.