Russia India Deal : పుతిన్ పర్యటన ఫలితం..155 ఏళ్ల రష్యా వైన్ దిగ్గజ కంపెనీతో భారత్ డీల్.

Update: 2025-12-09 11:47 GMT

Russia India Deal : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ముగిసిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య ఫలితాలు ఇప్పుడు వెల్లడవుతున్నాయి. ఇందులో భాగంగా రష్యాకు చెందిన 155 ఏళ్ల పురాతన వైన్ కంపెనీ అబ్రూ-డర్సో, ఒక భారతీయ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీలు కలిసి భారతదేశంలోనే మద్యపానీయాల ఉత్పత్తి ఫ్యాక్టరీని స్థాపించబోతున్నాయి. ఈ రష్యన్ కంపెనీని ఒకప్పుడు అప్పటి రష్యన్ చక్రవర్తి అలెగ్జాండర్ II స్థాపించడం విశేషం. అప్పటినుంచి ఈ కంపెనీ వైన్, ఛాంపాగ్నే రుచిని ప్రపంచమంతా ఆస్వాదిస్తోంది.

రష్యా ప్రముఖ వైన్ తయారీ సంస్థ అబ్రూ-డర్సో గ్రూప్, భారతదేశానికి చెందిన సంస్థ ఇండోబేవ్స్, వైన్ పానీయాల ఉత్పత్తి కోసం ఒక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్ నివేదిక ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఈ రెండు సంస్థల మధ్య ఉత్పత్తి సహకారం కోసం ఒక ఎంఓయూ పై సంతకాలు జరిగాయి. ఈ భాగస్వామ్యంలో మొదటి దశలో రెండు కంపెనీలు కలిసి భారతదేశంలోనే పండ్ల రసంతో తయారయ్యే వైన్‌ను స్థానికంగా ఉత్పత్తి చేయనున్నట్లు ఇంటర్‌ఫాక్స్ వెల్లడించింది.

భారతీయ భాగస్వామ్య సంస్థ ఇండోబేవ్స్ మద్యం పానీయాల ఉత్పత్తి, పంపిణీలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉందని అబ్రూ-డర్సో పేర్కొంది. ఇండోబేవ్స్ 2018 నుంచి తమ బ్రాండ్‌ను చురుకుగా అభివృద్ధి చేస్తోంది. అబ్రూ-డర్సో గ్రూప్‌కు భారతదేశం ఒక ముఖ్యమైన, అపారమైన అవకాశాలున్న మార్కెట్ అని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్లో తమ వ్యూహాన్ని అమలు చేయడానికి ఒక నమ్మకమైన అడుగు అని కంపెనీ తెలిపింది.

అబ్రూ-డర్సో అనేది రష్యా ప్రీమియం వైన్ తయారీ సంస్థ. ఇది ఒకప్పుడు కేవలం స్పార్క్లింగ్ వైన్ కోసం ప్రసిద్ధి చెందింది. దీనిని 1870లో చక్రవర్తి అలెగ్జాండర్ II స్థాపించారు. ఈ వైన్ తయారీ సంస్థ పేరుకు కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది.. అబ్రూ అనేది ఒక సరస్సు పేరు కాగా, డర్సో అనేది ఒక నది పేరు. ఈ రెండు కలిసిన ప్రాంతాన్నే అబ్రూ-డర్సో అంటారు. ఇది వైన్ తయారీకి చాలా ప్రసిద్ధి చెందింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. 2024లో ఈ సంస్థ మొత్తం 66.86 మిలియన్ల (సుమారు 6 కోట్లకు పైగా) వైన్ సీసాలను విక్రయించింది, ఇది 2023తో పోలిస్తే 18 శాతం పెరుగుదల. అలాగే 2024లో కంపెనీ ఆదాయం 26% పెరిగి 15.798 బిలియన్ రూబుళ్లు(రూ.1,405 కోట్లు)గా నమోదైంది.

Tags:    

Similar News