Saudi Arabia: ముస్లింలు కాని విదేశీయులకు మాత్రమే మద్యం విక్రయాలు.. అది కూడా షరతులతో
ఇంతకుముందు విదేశీ దౌత్యవేత్తలకు మాత్రమే అనుమతి..
సౌదీ అరేబియా తన సామాజిక సంస్కరణల్లో భాగంగా మద్యం విక్రయాలకు సంబంధించిన నిబంధనలను మరింత సడలించింది. నెలకు 50,000 రియాల్స్ (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.12 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతరులైన విదేశీ నివాసితులకు మద్యం కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సదుపాయాన్ని పొందడానికి విదేశీ నివాసితులు తమ ఆదాయాన్ని రుజువు చేస్తూ.. జీత ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ వివరాలు సమర్పించిన తర్వాతే రియాద్‌లో ఉన్న దేశంలోని ఏకైక లిక్కర్ అవుట్‌లెట్‌లో వారికి ప్రవేశం లభిస్తుంది.
ఈ రియాద్ అవుట్‌లెట్‌లో వినియోగదారులు నెలవారీ పాయింట్ల ఆధారిత అలవెన్స్ వ్యవస్థ కింద మద్యం కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ లిక్కర్ అవుట్‌లెట్‌ను గత ఏడాది విదేశీ దౌత్యవేత్తలకు విక్రయాల కోసం ప్రారంభించారు. ఇటీవల దీని సదుపాయాన్ని ప్రీమియం రెసిడెన్సీ హోదా ఉన్న ముస్లిమేతరులకు విస్తరించారు. రియాద్‌తో పాటు దేశంలోని మరో రెండు నగరాల్లో కూడా కొత్త లిక్కర్ స్టోర్‌లను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చారిత్రక మార్పు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో జరుగుతున్న విస్తృత సామాజిక సంస్కరణల్లో భాగం కావడం గమనార్హం.
రియాద్‌ను వ్యాపారం, పెట్టుబడులకు మరింత పోటీ కేంద్రంగా మార్చడం, అలాగే విదేశీ ప్రతిభను, పెట్టుబడిని ఆకర్షించడం ఈ ఆర్థిక పరివర్తనకు కీలకంగా సౌదీ అరేబియా భావిస్తోంది. ఈక్రమంలోనే భాగంగానే మద్యం అమ్మకాలకు అవకాశం ఇస్తోంది. ఇది మాత్రమే కాకుండా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. చాలా ఏళ్లుగా మహిళల డ్రైవింగ్‌పై కొనసాగిన నిషేధాన్ని కూడా కొన్నేళ్ల క్రితమే ఎత్తివేసింది. ప్రజావినోదం, సంగీతం, ఆడామగా సమావేశాలకు అనుమతించడం వంటివి చేసింది. ఇస్లాంకు జన్మభూమిగా మక్కా, మదీనాలకు పవిత్ర నగరాలకు కేంద్రంగా ఉన్న సౌదీలో ఈ మార్పులు చాలా సున్నితమైనవి.