US-Russia: రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం..

అమెరికా ట్రెజరీ కార్యదర్శి సంకేతాలు

Update: 2025-09-02 04:30 GMT

రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోవడంతో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ చర్చలు ఫలించలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగారు. పుతిన్, జెలెన్‌స్కీతో విడివిడిగా చర్చలు జరిపారు. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా చర్చలు జరుగుతుండగానే రష్యా.. ఉక్రెయిన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీంతో ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. శాంతి చర్చలకు పుతిన్‌ ముందుకు రాకపోవడంతో రష్యాపై మరిన్ని ఆంక్షలకు ట్రంప్ పరిశీలిస్తున్నట్లు స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటి వరకు ట్రంప్ ఓపికతో నిరీక్షించారని.. ఆ కారణంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. కానీ రష్యా మాత్రం పదే పదే బెదిరింపులకు దిగుతోందని.. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించాలని చూస్తున్నట్లు స్కాట్ బెసెంట్ చెప్పుకొచ్చారు.

రష్యా శాంతిని నిరాకరిస్తే ఆంక్షలతో శిక్షిస్తామని ఇటీవలే ట్రంప్ హెచ్చరించారు. ఇది ప్రపంచ యుద్ధం కాదని.. ఆర్థిక యుద్ధం అవుతుందని తెలిపారు. ఇక రష్యా లొంగకపోవడంతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్న ఆలోచనతో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి మరొక మార్గం ఉన్నట్లుగా అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.

ఇక భారత్-అమెరికా వాణిజ్య ఘర్షణను త్వరగా పరిష్కరించుకోవాలని ఆమెరికా భావిస్తోందని స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు వాణిజ్య సమస్యను పరిష్కరించుకుంటాయని తెలిపారు. అయితే రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని స్కాట్ బెసెంట్ తప్పుపట్టారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఆజ్యం పోస్తోందని హెచ్చరించారు.

Tags:    

Similar News